ORR Road Accident: మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కూలీలతో వేగంగా వెళ్తున్న ఒక ట్రాలీ వాహనం టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో, అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..
ఉపాధి కోసం మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీల బృందం శనివారం ఉదయం ఒక ట్రాలీలో కీసర నుంచి షామీర్‌పేట్ వైపు పనుల కోసం బయల్దేరింది. వాహనం కీసర ORR మీదుగా వేగంగా వెళ్తున్న క్రమంలో, ఊహించని విధంగా టైర్ పేలిపోయింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ట్రాలీ రోడ్డుపై బోల్తా పడింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న వారంతా కిందపడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితులంతా మహారాష్ట్రకు చెందినవారే
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారంతా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: రాహుల్ గాంధీ.. ఒకసారి మెంటల్ డాక్టర్‌ను కలవండి: కిషన్ రెడ్డి