Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత దేశద్రోహి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన మానసిక దుస్థితిని, ఆయన అసహనాన్ని తెలియజేస్తోందని చురకలంటించారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారనిపిస్తోందని, రాహుల్ గాంధీ ఎప్పుడైనా బహిరంగంగా మాట్లాడేటప్పుడు మెంటల్ డాక్టర్ దగ్గర ఓసారి చెక్ చేయించుకుంటే మంచిదని కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
క్షమాపణలు చెప్పడం పోయి.. పాఠాలు చెప్పడం ఏంటి..
ఒక పార్టీ జెండాతో గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించి, క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. అదే రోజు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమని ఫైరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వేరే పార్టీల టికెట్లపై ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారన్నారు. దానం నాగేందర్ అయితే ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే, రాహుల్ గాంధీ ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి ఆగ్రహం..
ఆ నియోజకవర్గాల ప్రజలు ఓ పార్టీని నమ్మి ఓటేశారని, కానీ కాంగ్రెస్ ఆ ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ.. ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకుందని, అసలైన ‘ఓట్ చోరీ’ అంటే ఇదేనని కిషన్ రెడ్డి చురకలంటించారు. ఫిరాయింపుల ద్వారా ప్రజల తీర్పును దొంగిలించిన పార్టీకి.. ఇతరులు ఓట్లు దొంగిలించారని ఆరోపించే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోతూ.. నిరాశ నిస్పృహలకు గురవుతున్న కాంగ్రెస్, రాహుల్ గాంధీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు వీరిని ఛీత్కరించినప్పుడల్లా ఏం చేయాలో పాలుపోక రాజ్యాంగబద్ధ సంస్థలపై వారి అసహనాన్ని వెళ్లగక్కుతున్నారని ఫైరయ్యారు.
కేంద్ర మంత్రి విమర్శలు..
అవినీతి నాయకులపై ఈడీ, సీబీఐలు విచారణ జరిపితే కూడా కాంగ్రెస్ గగ్గోలు పెడుతూ.. విచారణ సంస్థలను దుర్వినియోగం జరుగుతోందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. నిజంగానే విచారణ సంస్థలను దుర్వినియోగం చేసేదే నిజమైతే.. ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో రాహుల్ గాంధీ బెయిల్ పై బయట ఎందుకు తిరుగుతున్నారో ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ సుప్రీం కోర్టును నమ్మదని, ఎన్నికల కమిషన్‌పై నమ్మకం ఉండదని, ఈవీఎంపై అనుమానాలు వ్యక్తం చేస్తుందని, చివరకు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సాయుధ బలగాలనూ నమ్మదని ఫైరయ్యారు. మరి రాహుల్ గాంధీ ఇంకెవరిని నమ్ముతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఎందుకు అర్థం పర్థం లేని ఆరోపణలు..
ఎస్ఐఆర్ నిర్వహించిన చోట ఓట్ చోరీ ద్వారా బీజేపీ గెలిచిందంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తూ వచ్చారని, కానీ ఎస్ఐఆర్ నిర్వహించిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించిన 20 నియోజకవర్గాల్లో టీఎంసీ 13 స్థానాల్లో గెలిచిందని వివరించారు. కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా లక్షలాది మంది బూత్ ఏజెంట్లు ఉన్నారని, ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే.. తెలియజేయడానికి చాలా సమయం ఇచ్చారని, అయినా కూడా ఎలాంటి అభ్యంతరాలు దాఖలు చేయలేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ప్రమాణపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేస్తే మౌనం వహించారని, మరి అలాంటప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి..
ఇదిలాఉండగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి బర్కత్‌పురలో ఉన్న బీజేపీ నగర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గణేష్ నిమజ్జన వేడుకల సందర్బంగా కిషన్ రెడ్డి అంబర్‌పేట్ నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా భక్తులకు దగ్గరుండి భోజనం వడ్డించారు. అంతేకాకుండా, వచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. అనంతరం ఓయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథున్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.
Also Read: రైలు వెళ్లాక టికెట్ ఇస్తే ఏం లాభం? ఓటరు లిస్ట్ సవరణపై ఉత్తమ్ సెటైర్లు