Tata Aeris First Look: భారత మార్కెట్లో టాటా మోటార్స్ మరో కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను తీసుకొచ్చింది. టాటా ఏరిస్ పేరుతో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.5.29 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. పాత టిగోర్ కు అప్ డేటెడ్ గా వచ్చిన ఏరిస్‌లో డిజైన్‌తో పాటు ఫీచర్లు, సేఫ్టీ విషయంలోనూ పలు మార్పులు చేశారు. పెట్రోల్, CNG ఇంజిన్లతో పాటు మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభం కాగా, కస్టమర్ డెలివరీలు అక్టోబర్ 11 నుంచి మొదలుకానున్నాయి.
టాటా ఏరిస్‌ను మొత్తం ఐదు వేరియంట్లలో అందిస్తోంది. స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, క్రియేటివ్, అకంప్లిష్డ్ పేర్లతో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. పెట్రోల్ మాన్యువల్ మోడల్ ధరలు రూ.5.29 లక్షల నుంచి రూ.8.19 లక్షల వరకు ఉన్నాయి. స్మార్ట్ వేరియంట్ రూ.5.29 లక్షలతో ప్రారంభమవుతుంది. ప్యూర్ రూ.6.14 లక్షలు, ప్యూర్ ప్లస్ రూ.6.74 లక్షలు, క్రియేటివ్ రూ.7.49 లక్షలు, టాప్ వేరియంట్ అకంప్లిష్డ్ రూ.8.19 లక్షలుగా ఉన్నాయి. CNG వేరియంట్ల ధరలు రూ.6.29 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.19 లక్షల వరకు ఉన్నాయి. AMT వెర్షన్ల ధరలను టాటా ఇంకా వెల్లడించలేదు. ప్యూర్ నుంచి అకంప్లిష్డ్ వరకు పలు వేరియంట్లలో AMT ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
ఏరిస్‌ను చూస్తే టిగోర్ తో పోలిస్తే కొత్త డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఎత్తైన బోనెట్, LED హెడ్ ల్యాంప్స్, ఐబ్రో తరహా LED DRLs ఉన్నాయి. గ్లోస్ బ్లాక్ గ్రిల్ కారణంగా కారు ముందు భాగం మరింత వెడల్పుగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ పెద్దగా మారకపోయినా, కొత్త 15- అంగుళాల అల్లాయ్ వీల్స్ ను అందించారు. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇవి బూట్ లిడ్ వరకు విస్తరించే లైటింగ్ ఎలిమెంట్లను కలిగి ఉంటాయి. మొత్తంగా ఏరిస్ డిజైన్ కు కొంత ప్రీమియం టచ్ ఇచ్చారు.
కొత్త ఏరిస్ పెట్రోల్ వెర్షన్‌లో 419 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. CNG మోడల్‌లోనూ స్థల వినియోగంపై టాటా ప్రత్యేక దృష్టి పెట్టింది. సెగ్మెంట్‌లో మంచి బూట్ స్పేస్ అందించే మోడళ్లలో ఒకటిగా ఉండబోతోంది. ఏరిస్ ఇంటీరియర్ లో కూడా టాటా మంచి మార్పులు చేసింది. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం ఉండటం ఈ సెగ్మెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇవే కాకుండా 360 డిగ్రీ కెమెరా, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనుక AC వెంట్స్, డ్రైవర్ ఆర్మ్ రెస్ట్, లెదరెట్ సీట్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. AMT వెర్షన్లలో సంప్రదాయ గేర్ లివర్ కు బదులుగా రోటరీ సెలెక్టర్‌ను ఉపయోగించారు.
టాటా ఏరిస్‌లో 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌లను అందిస్తున్నారు. పెట్రోల్ ఇంజిన్ 86 PS పవర్, 113 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్ 72.5 PS పవర్, 96.5 Nm టార్క్ ను అందిస్తుంది. రెండు ఇంజిన్‌లకు 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు AMT గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. అయితే ఏరిస్ కు సంబంధించిన అధికారిక మైలేజ్ వివరాలను టాటా ఇంకా ప్రకటించలేదు.
ఏరిస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఇచ్చారు. 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హిల్ హోల్డ్ కంట్రోల్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, రోల్‌ఓవర్ మిటిగేషన్ వంటి సేఫ్టీ టెక్నాలజీలు కూడా అందించారు. అయితే కొత్త ఏరిస్‌కు భారత్ NCAP రేటింగ్ ఇంకా రాలేదు.
ధర, ఫీచర్ల పరంగా టాటా ఏరిస్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు ఇది ప్రత్యర్థిగా నిలుస్తుంది. రూ.5.29 లక్షల ప్రారంభ ధర, CNG, AMT ఆప్షన్లు, అధునాతన ఫీచర్లతో పండుగ సీజన్ లో ఏరిస్ పై కొనుగోలుదారులు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది.
Read Also: టాటా To హ్యుందాయ్.. అక్టోబర్ లో విడుదలయ్యే సూపర్ మోడల్స్ ఇవే!