Khairatabad Bypoll: స్వేచ్ఛ బ్యూరో : ఖైరతాబాద్ ఉప ఎన్నిక కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరో సవాల్‌గా మారనుంది. ఇప్పటికే ఆయన పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొన్న బీజేపీకి.. ఇప్పుడు ఖైరతాబాద్ రూపంలో మరో బైపోల్ తలుపు తట్టింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఈ ఉప ఎన్నికపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ స్థానంలో విజయం సాధించాలంటే కిషన్ రెడ్డి పూర్తిస్థాయిలో ఎఫర్ట్స్ పెట్టాలని శ్రేణులు భావిస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో.. పరువు పోయినంత పనయింది. కాగా ఖైరతాబాద్‌లో మాత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వరుసగా ఉప ఎన్నికలు రావడం కిషన్ రెడ్డికి రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి అనుకున్న స్థాయిలో ఫలితం దక్కకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఇప్పుడు ఖైరతాబాద్‌లోనూ అదే పరిస్థితి ఎదురైతే.. అది కిషన్ రెడ్డి నాయకత్వంపై మరింత చర్చకు కారణమయ్యే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. దీంతో ఈసారి ఖైరతాబాద్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం బీజేపీ కసరత్తు
మరోవైపు కిషన్ రెడ్డి అనుచరుల విషయంలోనూ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు, అనుచరులు మాత్రం కిషన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారని.. అయితే కష్టకాలంలో ఆయన పార్టీ కార్యకర్తలకు ఎంతవరకు అండగా నిలుస్తున్నారన్న ప్రశ్నలు కొందరు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన అనుచరులను ఎన్నికల్లో గెలిపించుకున్న సందర్భాలు పెద్దగా కనిపించడం లేదన్న అభిప్రాయం పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం బీజేపీ కసరత్తును వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇన్‌చార్జీల నియామకం, స్థానిక నేతలతో సమన్వయం, బూత్ స్థాయి కార్యకర్తలను యాక్టివ్ చేయడం వంటి అంశాలపై పార్టీ దృష్టి పెట్టినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఖైరతాబాద్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుగానే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఆధారంగానే.. వచ్చే ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతామని శ్రేణులు భావిస్తున్నాయి. కాగా ఇదే తరుణంలో కొత్త ఇన్ చార్జీల నియామకంతో కమలం పార్టీకి ఎలక్షన్ పై సీరియస్ నెస్ మరింత పెరిగినట్లు చర్చ జరుగుతోంది.
పార్టీ వ్యూహాలపై మరోసారి అంతర్గత చర్చ
ఖైరతాబాద్ ఫలితం కేవలం ఒక అసెంబ్లీ స్థానానికి పరిమితం కాకుండా.. రాబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలంటే ఖైరతాబాద్ వంటి కీలక నియోజకవర్గాల్లో మెరుగైన ప్రదర్శన అవసరం. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార నిర్వహణ వరకు ప్రతి అంశం కిషన్ రెడ్డికి పరీక్షగా మారనుంది. పార్టీ కేడర్‌ను ఒక్కతాటిపైకి తీసుకురావడం, స్థానిక నేతల మధ్య సమన్వయం సాధించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా కనిపిస్తున్నాయి. ఇక ఖైరతాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేయడం ద్వారా జూబ్లీహిల్స్ ఫలితానికి సమాధానం చెప్పాలన్న పట్టుదలతో బీజేపీ ముందుకు సాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కిషన్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలో వరుసగా ఎదురవుతున్న ఉప ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి ఫలితాలు అందిస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తే హైదరాబాద్‌లో పార్టీ బలోపేతానికి అది కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంటుందని శ్రేణులు భావిస్తున్నాయి. లేదంటే కిషన్ రెడ్డి నాయకత్వం, పార్టీ వ్యూహాలపై మరోసారి అంతర్గత చర్చకు దారితీసే అవకాశం ఉంది. మొత్తంగా.. ఖైరతాబాద్ ఉప ఎన్నికను కిషన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు? బీజేపీ కాషాయ జెండాను ఎగురవేయగలదో లేదో అనేది ఎన్నికల ఫలితమే తేల్చనుంది.
Also Read: నిమజ్జనం చేస్తూ మూసీలో పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం!