Khairatabad Bypoll: గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీ పార్టీకి మరో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావడం తిరిగి బరిలో ఉండటంతో బీఆర్‌ఎస్‌కు కీలకమైన పోరుగా మారనుంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి 67,368 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డిపై 22,010 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీఆర్‌ఎస్ ఈ స్థానంలో తన పట్టును కొనసాగించింది. ఇప్పుడు పరిస్థితులు మారిన నేపథ్యంలో.. పాత బలాన్ని గులాబీ పార్టీ నిలబెట్టుకోగలదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఖైరతాబాద్‌కు ముందు హైదరాబాద్‌లో జరిగిన రెండు ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. సర్వశక్తులు ఒడ్డినా ఘోర ఓటమిని చవిచూసింది. 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి జి.నివేదిత మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 53,651 ఓట్లు సాధించి విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి 40,445, బీఆర్‌ఎస్ అభ్యర్థి 34,462 ఓట్లు పొందారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
ఆ తర్వాత 2025లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్‌కు మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్‌యాదవ్ 98,988 ఓట్లు సాధించి బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు లభించాయి. గ్రేటర్ పరిధిలో బీఆర్‌ఎస్ సిట్టింగ్‌గా ఉన్న రెండు స్థానాలకు ఉప ఎన్నికలు రావడం, రెండింటినీ కోల్పోవడం ఆ పార్టీ నాయకత్వానికి ఆత్మపరిశీలనకు దారితీసిన అంశంగా మారింది.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్‌కు కీలకంగా మారింది. ఒకవైపు 2023లో సాధించిన గెలుపును నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు గత రెండు ఉప ఎన్నికల్లో ఓటమితో కేడర్లో నైరాశ్యం నెలకొంది. గత రెండు ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపికలో తప్పిదం, కుటుంబ సభ్యులకు సెంటిమెంట్ కలిసి వస్తుందని భావించిన పార్టీకి రివర్స్ అయింది. టికెట్ రేసులో ఉన్నవారికి పోటీచేసే అవకాశం రాకపోవడంతో వారు సహకరించలేదనే ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో పార్టీ సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నాయకత్వంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లో తన రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ నాయకత్వం వహించిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రివర్స్ ఫలితాలు వచ్చాయి. సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. దీంతో ఇప్పుడు ఖైరతాబాద్ పోరుపై పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కేటీఆర్ కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అభ్యర్థి ఎంపిక, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం, డివిజన్ల వారీగా పార్టీ కేడర్‌ను కదిలించడం, ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కోవడం వంటివి కేటీఆర్ ముందున్న ప్రధాన అంశాలు.
Also Read: దానం అవుట్.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకటే టెన్షన్!
కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ఇప్పటికే పునర్‌వ్యవస్థీకరణ, క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టి సారిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, భవిష్యత్ ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొంటామని ఇటీవలే కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగితే కేటీఆర్ నాయకత్వానికి మరో ప్రత్యక్ష పరీక్షగా మారనుంది. రెండుసార్లు ఓడిన ఉప ఎన్నికల అనుభవం.. మారిన రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నాయకత్వానికి సవాల్. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ పోరు బీఆర్‌ఎస్‌కు కేవలం మరో ఉప ఎన్నిక కాదు.. గ్రేటర్‌లో తదుపరి రాజకీయ అడుగుకు కీలక సంకేతంగా మారనుంది.
Also Read: యాపిల్ కొనేముందు తీయగా, జ్యూసీగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ