Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ భారీ గణనాథుడు గంగమ్మ చెంతకు చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేశుడ్ని నిమజ్జనం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్త జనం సందోహం మధ్య 69 అడుగుల మహా గణపతి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అయ్యారు. అంతకుముందు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కాగా.. దారిపొడవునా భక్తులు విశేషంగా చేరి స్వామిని దర్శించుకున్నారు.
ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర.. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకూ సాగింది. వేలాది మంది భక్తులు దారిపొడవునా చేరుకొని.. గణనాథుడి ఆశీస్సులు పొందారు. స్థానికులు తమ ఇళ్లు, భవనాలపైకి ఎక్కి.. ఈ శోభాయాత్రను ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను పూర్తిచేశారు.
శోభాయాత్ర ప్రారంభ సమయంలో దానం నాగేందర్ మహాగణపతి ఎదుట డ్యాన్స్ చేశారు. మహిళా కానిస్టేబుళ్లతో కలసి స్టెప్పులేశారు. దీంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారిపోయింది. దానం డ్యాన్స్ కు సంబంధించి దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?
ఇదిలా ఉంటే గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా సాగేందుకు ఏకంగా 28 వేల పోలీసులతో నగరంలో పహారా ఏర్పాటు చేశారు. 10 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘాను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 24 డ్రోన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలతో పరిస్థితులను గమనిస్తున్నారు. మరోవైపు నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 40కి పైగా భారీ క్రేన్లను సిద్ధం చేశారు.
Also Read: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు!