India’s Fastest Bullet Train: భారత హైస్పీడ్ రైలు ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జపాన్ సాంకేతిక సహకారంతో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ముందుకు సాగుతుండగా.. భవిష్యత్ లో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో బుల్లెట్ రైళ్లను తయారు చేయాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా B35ని రూపొందిస్తోంది.
ప్రస్తుతం భారత్ లో నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైలు వ్యవస్థ గంటకు 320 కిలోమీటర్ల వేగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. అయితే, ఆ తర్వాత దశలో మరింత వేగవంతమైన రైలును అభివృద్ధి చేయడంపై రైల్వేశాఖ దృష్టి సారించింది. B35 రైలును గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచేలా అభివృద్ధి చేయలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా బుల్లెట్ రైలు టెక్నాలజీలో భారత్ తన సొంత సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
ఇప్పటివరకు హైస్పీడ్ రైలు రంగంలో భారత్‌కు జపాన్ వంటి దేశాల సాంకేతిక సహకారం కీలకంగా ఉంది. అయితే, భవిష్యత్ అవసరాల కోసం రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇతర టెక్నాలజీలను దేశీయంగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి స్వదేశీ హైస్పీడ్ రైళ్లను అభివృద్ధి చేయడంతో పాటు, వాటిని నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేయాలనే లక్ష్యంగా పని చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే హైస్పీడ్ రైల్వే రంగంలో భారత్‌కు సాంకేతికంగా మరో కీలక ముందడుగు పడే అవకాశం ఉంది.
జపాన్ ప్రస్తుతం తన నెక్ట్స్ జెనరేషన్ E10 బుల్లెట్ రైలును అభివృద్ధి చేస్తోంది. E5 సిరీస్ రైళ్ల తయారీని క్రమంగా నిలిపివేస్తామని జపాన్ 2024లో ప్రకటించింది. E10 రైళ్ల ఉత్పత్తి 2030లో ప్రారంభమై, 2034 నాటికి సేవల్లోకి వచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. భారత్ కూడా అదే సమయంలో తన సొంత హైస్పీడ్ రైలు టెక్నాలజీని అభివృద్ధి చేయాలని చూస్తోంది. భవిష్యత్‌లో జపాన్ కొత్త రైళ్లను ఉపయోగించే అంశాన్ని కూడా భారత అధికారులు పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ, స్వదేశీ రైళ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
B35తో పాటు భారత్ B28 అనే మరో స్వదేశీ హైస్పీడ్ రైలు అభివృద్ధిపైనా పనిచేస్తోంది. రైలు తయారీతో పాటు వాటిని సురక్షితంగా నడిపించేందుకు అవసరమైన కంట్రోల్, సిగ్నలింగ్ వ్యవస్థలను కూడా దేశీయంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (BTCS) పై పని చేస్తోంది. రైళ్ల వేగాన్ని నియంత్రించడం, ఒక రైలుకు మరో రైలుకు మధ్య సురక్షిత దూరాన్ని కొనసాగించడం లాంటి అంశాల్లో ఈ వ్యవస్థ కీలకంగా ఉండనుంది. ఒకవైపు ప్రస్తుత హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ముందుకు సాగుతుండగా.. మరోవైపు 350 కిలోమీటర్ల వేగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న B35 వంటి స్వదేశీ రైళ్లకు పునాది పడుతోంది.
Read Also: పొగమంచు దెబ్బకు రైళ్లపై ఆంక్షలు.. ఏకంగా ఎన్ని ట్రైన్లు రద్దయ్యాయంటే?