Khammam Water: స్వేచ్చ బ్యూరో: నిత్యం భూగర్భ జలాలు వృధా కావడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఖమ్మం నగరంలోని 9వ వార్డు లో నీటి కుళాయి ద్వారా ఇచ్చే తాగునీటి సమస్య నెలకొంది. ఇక్కడ ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతుంటే, మున్సిపల్ యంత్రాంగం నీరెత్తినట్లు వ్యవహరించడం భావ్యం కాదని బాధితులు వాపోతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని,9వ వార్డు బైపాస్ రోడ్డు ఏరియాలో మిషన్ భగీరథ ట్యాంకులు నెలకొన్న లైన్ లోనే రోజులు గడుస్తున్నా మున్సిపల్ కుళాయిల ద్వారా నీరు సరఫరా కాకపోవడం మున్సిపల్ పరిపాలనా విఫలత్వానికి అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు పెద్దెత్తున భూగర్భ జలాలు తోడేస్తున్నారు. ప్రైవేటు సైన్యం చేత ట్యాంకర్లు నింపుకెల్లే బోర్ వద్ద నిత్యం వృధాగా నీరు ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదు . భూగర్భ నీరు అడుగంటి పోయి చుట్టు పక్కల ఉన్న ప్రజల బోరు ల్లో నీళ్లు అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో సైతం గంట వ్యవధిలోనే నిండే ఇంటి పై ట్యాంకులు, ప్రస్తుతం మూడు గంటల వ్యవధి పడుతుందని వాపోతున్నారు. నీళ్ల ట్యాంకర్ల ప్రైవేటు దందా పట్ల అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చాలా బోర్లు అడుగంటాయని, ఉన్న కొద్ది తాగునీటిని పొదుపుగా, అత్యవసర పరిస్థితిని ప్రకటించైనా యుద్ధప్రాతిపదికన ప్రైవేట్ ట్యాంకర్లను నిరోధించాలని కార్పోరేషన్ ద్వారా నే నీటిని సరఫరా చేయించాలని కోరుతున్నారు. నిలిచిన మిషన్ భగీరథ పధకం పంపిణీ లైన్ ల మరమ్మతులు చేయించి కుళాయి లతో నీటి పంపిణీ పునరుద్ధరించాలని, నీటి వ్యాపారం చేస్తున్న బోర్ల ను వెంటనే ప్రభుత్వ అజమాయిషీలో తీసుకోవాలని కోరుతున్నా రు.
Also Read: నేషనల్ మీడియా ఇంట్రాక్ట్‌లో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!
మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మిషన్ భగీరథ తాగునీటి నీటిసరఫరా పూర్తి స్థాయిలో చేయ లేకపోవడాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆసరాగా చేసుకుని భూగర్భ జలాలు తోడేస్తున్నారు. ప్రైవేట్ బోరుబావుల పేరు చెప్పి వందలాది ట్యాంకర్లకు భూగర్భ జలాలు పూర్తిగా లాగే స్తున్నారని, పలు అపార్ట్ మెంట్‌లకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగర 9వార్డు ప్రజల ప్రాథమిక హక్కైన తాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం చోటుచేసుకుందని అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేసైనా భూగర్భ జలాల వాడుకలో పొదుపు పాటించాలని దీనిపట్ల శాశ్వత పరిష్కారాలకు కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నారు.
Also Read: మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?