మంత్రి పదవికోసం నానా రచ్చ చేస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆల్రడీ కోమటి రెడ్డి ఫ్యామిలీలో వెంకట్ రెడ్డికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ రాలేదు. అయితే అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని, ఆ హామీ నిలబెట్టుకోవాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేయడం విశేషం. మంత్రి వర్గ విస్తరణలో కూడా తనకు న్యాయం జరగలేదని కొన్ని రోజులుగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెబుతూనే అప్పట్లో తన నిరసన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. “నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను.” అంటూ వైరాగ్యంతో కూడిన ట్వీట్ వేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని ట్వీట్లు వేశారు. తాజాగా మరోసారి మంత్రి పదవికోసం ఆయన పెదవి విప్పారు. కానీ ఫలితం లేకపోవడంతో తన అసంతృప్తిని ట్వీట్ల రూపంలో బయటపెడుతున్నారాయన.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమ… pic.twitter.com/pxaw9SgYMn
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 11, 2025
ఆయనకు ధన్యవాదాలు..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్వ్యూని ప్రస్తావిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది నిజమేనంటూ భట్టి చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన భట్టికి ధన్యవాదాలు.. అంటూ ఓ ట్వీట్ వేశారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఇగో చల్లబడిందా..?
మంత్రి పదవి కావాలంటూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని కాంగ్రెస్ లో ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవడం విశేషం. ఆయన సొదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. మంత్రి పదవి రాకపోవడం ఒక బాధ అయితే, తనపై ఎవరూ సింపతీ చూపించడం లేదనే బాధ కూడా రాజగోపాల్ రెడ్డికి ఉంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు ఆయన ఇగో చల్లార్చినట్టున్నాయి. అందుకే ఆయన భట్టి మాటల్ని కోట్ చేస్తూ ట్వీట్ వేశారు. తనకు పదవి ముఖ్యం కాదంటూ మరోసారి వేదాంత ధోరణిలో కామెంట్ చేశారు.