KTR Comments on HYDRA Demolitions: మంత్రి కొండా సురేఖ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి కేటీఆర్, కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆమె మండిపడింది. తనని దారుణంగా కించపరుస్తూ పోస్టులు పెట్టారంటూ కొండా సురేఖ కంటతడి సైతం పెట్టారు. ఈ పోస్టుల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ సదరు మంత్రి వారిని హెచ్చరించారు.
Also Read: ట్రోలింగ్స్ బ్యాచ్ కి సినిమా చూపించనున్న రేవంత్ సర్కార్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పట్ల గుస్సా
ఈ క్రమంలో కేటీఆర్ కు ఊహించిన విధంగా భారీ షాక్ తగిలింది. మంగళవారం ఆయన అంబర్ పేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డగించి ఏ మాత్రం ముందుకు కదలకుండా భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేటీఆర్ కు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. కేటీఆర్ ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఇటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా వారికి పోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ సిచుయేషన్ నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
ఇదిలా ఉంటే.. అంబర్ పేట పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. పలువురు బాధితులతో మాట్లాడి వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ డెవెలప్ మెంట్ పేరుతో రూ. కోట్లు దోచుకోబోతున్నారని, అదేవిధంగా సుమారుగా 2 లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన ఆరోపించారు. తమ హయాంలో మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలివేశామన్నారు. అందుకు కారణం పేదలకు ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశం మాత్రమేనంటూ కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read: మూసీ ప్రక్షాళన అడ్డుకోవడం వెనుక.. చేతులు మారిన వందల కోట్లు
గత అసెంబ్లీ ఎన్నికల్లో నగర ప్రజలు బీఆర్ఎస్ కు పట్టంకట్టారన్నారు. దీంతో వారిపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టి లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. నగరంలో చాలామంది తమ ఇళ్లు ఎప్పుడు కూల్చుతారోనని దిగులుగా ఉన్నారంటూ ఆయన అన్నారు. ఇక నుంచి నగర ప్రజలు తమ ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే వాటిని అడ్డుకునేందుకు కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. అంబర్ పేటలో పేద ప్రజల ఇళ్లు కూల్చుతుంటే స్థానిక ఎంపీ ఎక్కడికి వెళ్లారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… వీళ్లిద్దరూ ఒక్కటేనంటూ పరోక్షంగా ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందంటూ ఆయన భరోసా ఇచ్చారు.