Mahabubabad News: చీకటి పడిందా.. ఒకటే రాళ్ల వర్షం.. ఒకవైపే కాదు నలువైపుల నుండి రాళ్ల వర్షం కురుస్తోంది. అక్కడి ప్రజల భయాందోళన అంతా ఇంతా కాదు. దెయ్యం అంటున్నారు కొందరు. మరికొందరు భూతం అంటున్నారు. ఇంకా కొందరైతే గ్రామానికి చేతబడి చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఏ మర్మం ఉందో కానీ, ప్రజలు మాత్రం నిద్రాహారాలు మాని గ్రామానికి కాపలా కాస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో వెలుగులోకి వచ్చింది.
పగలంతా పనులు చేసుకొని, రాత్రి వేళ ఇంటికి రావడం, కాపలా కాయడం ఇదే గ్రామస్తులకు అలవాటుగా మారింది. అలా కునుకుతీస్తే చాలు.. ఆ కాలనీపైకి రాళ్ల వర్షం కురుస్తోంది. అందుకే ఏం చేయాలో తోచని ఆ కాలనీవాసులు.. ఇప్పుడు కర్రలు చేతబట్టి పహారా కాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో కూలీనాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ కాలనీలో విచిత్ర ఘటన జరుగుతోంది. దీనితో కాలనీవాసులు, పోలీసులను ఆశ్రయించారు.
అలా చీకటి పడితే చాలు.. కాలనీపై రాళ్లు పడుతున్నాయి. కావాలనే ఎవరైనా చేస్తున్నారా అంటే అక్కడ ఎవరూ కనిపించడం లేదట. కొంతమంది దెయ్యం అంటుండగా, మరికొందరు భూతం అనేస్తున్నారు. ఇంకా కొంతమంది గ్రామానికి చేతబడి చేశారని, అదే ఈ పరిస్థితికి కారణమని అనేస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి అనుమానాలను కొట్టి పారేస్తున్న యువకులు, అసలు మిస్టరీ తెలుసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాదు పోలీసులకు కూడ దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలని ఫిర్యాదు చేశారు.
అత్యవసర సమయంలో బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఎప్పుడు ఏ ఇంటి మీద ఏ రాయి పడుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని కాలనీవాసులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే దెయ్యం.. భూతం అన్న కారణంతో కొందరు ఇళ్లు కూడ ఖాళీ చేసి వెళ్లి పోతున్నారట. అంతేకాదు తెల్లవారుజామున ప్రతి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు లభ్యమవుతుండగా ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి, కాలనీవాసుల్లో గల భయాన్ని పోగొట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద నిఘా.. నెక్స్ట్ దాడికి వస్తే చుక్కలే..
అలాగే జనవిజ్ఞాన వేదిక లాంటి సంఘాలు స్పందించి గ్రామంలో పర్యటించాలని, ప్రజల్లో గల మూఢనమ్మకాలను తరమికొట్టాలని యువకులు కోరుతున్నారు. నేటి రోజుల్లో కూడ ఇలాంటి భయాలు వ్యక్తం చేస్తున్న ప్రజల్లో చైతన్యం తీసుకు రావలసిన భాద్యత స్థానిక అధికారులపై ఉంది. మరి ప్రజల్లో గల భయం పోగొట్టేనా? అసలు మిస్టరీ బయటకు వెల్లడయ్యేనా అనేది మున్ముందు తెలియాల్సి ఉంది.