Tractor Engine: గుండ్లపోచంపల్లి డివిజన్ చెందిన ట్రాక్టర్ ఇంజన్ చోరీకి గురైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మినీ ట్యాంక్‌బండ్ వద్ద పార్క్ చేసిన మహీంద్రా ట్రాక్టర్ నుంచి ఇంజన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
గుండ్లపోచంపల్లి డివిజన్‌కు చెందిన TS 08 UL 1644 నంబర్ గల మున్సిపల్ మహీంద్రా ట్రాక్టర్‌ను డ్రైవర్ సత్త్వాజీ ఈ నెల 18న మధ్యాహ్నం 3.30 గంటలకు మినీ ట్యాంక్‌బండ్ వద్ద పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్లి చూడగా ట్రాక్టర్ బాడీ మాత్రమే కనిపించింది. ఇంజన్ మాత్రం మాయమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఇంజన్ ఆచూకీ లభించకపోవడంతో మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కుర్రియముల భాస్కర్ పోలీసులను ఆశ్రయించారు. ఇంజన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంజన్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? పక్కా సమాచారంతోనే చోరీ జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించే అవకాశం ఉంది.
Also read: నిద్రపోయిన అంపైర్.. సంజు సిక్సర్ కొడితే, 4 ఇచ్చాడు