PDS Rice: స్వేచ్చ బ్యూరో: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మేడ్చల్ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. డబిల్‌పూర్ కమ్మాన్ సమీపంలోని జాతీయ రహదారి-44పై శనివారం వాహనాన్ని తనిఖీ చేయగా 540 బస్తాల్లో ఉన్న 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం బయటపడింది. షామీర్‌పేట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందింది.
దీంతో పౌరసరఫరాల అధికారులు పంచుల సమక్షంలో డబిల్‌పూర్ కమ్మాన్ వద్ద భారత్ బెంజ్ వాహనం (జీజే-25-యూ-5532)ను అడ్డుకుని తనిఖీ చేశారు. వాహనంలో 540 ప్లాస్టిక్ బస్తాల్లో సుమారు 270 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ లఖ్మన్ కె. రైగా, హెల్పర్ రతాడియా మల్దేబాయిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఉమేశ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు డ్రైవర్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఉమేశ్ ఫోన్‌కు స్పందించకపోవడంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: బేకింగ్ లవర్స్ కోసం బెస్ట్.. ఇక ఇంట్లోనే పిజ్జా,కేక్స్
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం విలువ రూ.15.50 లక్షలు కాగా, రవాణాకు ఉపయోగించిన భారత్ బెంజ్ వాహనం విలువ సుమారు రూ.8.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం రూ.24 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: చంద్రగిరిలో ఏనుగుల రచ్చ.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!