Konda Surekha : మంత్రి కొండా సురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ మీటింగ్ కోసం సచివాలయానికి వచ్చారు. మీటింగ్ హాలులోకి వెళుతుండగా కళ్లు తిరిగి పడిపోయారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వైద్యులను పిలిపించారు. డాక్టర్లు చెక్ చేసి.. లో బీపీ, లో షుగర్ వల్ల కళ్లు తిరిగాయని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. ఏమీ తినకపోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోయాయి. సెక్రటేరియట్‌లోనే ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ ఆమెకు ప్రథమ చికిత్స చేసింది. ఆ తర్వాత ఆహారం తీసుకోవడంతో కొండా సురేఖ తేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. కేబినెట్ మీటింగ్‌కు తిరిగి హాజరయ్యారు. మంత్రి మండలి సమావేశం ముగిశాక హాస్పిటల్‌కు వెళతారని తెలుస్తోంది.
సచివాలయంలో అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.