Turmeric Board: ఎన్నో రోజుల ఇందూరు ప్రజల చిరకాల కల నేటికి నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఉన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలమూరు మహా సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే కేంద్ర వాణిజ్య శాఖ దీపై గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఆ సమయంలో బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో తెలపలేదు. అయితే, తాజాగా నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది.
నిజామాబాద్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ గంగారెడ్డి, స్పైసెస్ బోర్డు నేషనల్ సెక్రటరీ రమశ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుల భారీ ఎత్తున హాజరయ్యారు. ఎంపీ అర్వింద్ కు ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రధాని మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల దశాబ్దాల పసుపు బోర్డు కల నేటికి నెరవేరిందని అన్నారు. బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనాలు చేకూరనున్నాయని అన్నారు. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉంటుందని ఎంపీ అర్వింద్ పేర్కొ్న్నారు. పసుపు బోర్డుతో తన హామీ పూర్తి కాలేదని.. నిజామాబాద్ కు ఇంకా చాలా వస్తాయని.. అభివృద్ధి పనులు చేస్తూనే ఉంటామని అన్నారు. పసుపు బోర్డు రైతులకు మాత్రమే కాదు.. జిల్లా మొత్తానికి పర్యాటకంగా మారుతోందని అన్నారు. బోర్డు ఏర్పాటు చేయడం రైతులకు మెరుగైన ధర లభిస్తుందని.. స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్ , రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధాని మోదీకి పాదాభివందనలు తెలియజేశారు.
పండుగ రోజున రైతుల కోసం ప్రధాని మోదీ గొప్ప మేలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పసుపు బోర్డు అర్వింద్ గా పేరు తెచ్చుకొని.. మొండి పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. సంక్రాంతి పండుగ రోజు రైతుల కల నెరవేరిందని అన్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీలుగా చాలా మంది చేశారు. కానీ అరవింద్ ఒక్కరే బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ తన హామీ నిలబెట్టుకున్నారని అభినందించారు. అర్వింద్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. బోర్డు ద్వారా నూతన వంగడాలు, పరిశోధనలు, భూసారం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి – ఆదాయం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పసుపు బోర్డు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి, నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే అవకాశం ఉందని అన్నారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోడీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
Also Read: Harish Rao: అందుకే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు తెస్తామంటూ పలు పార్టీలు మోసం చేశాయని అన్నారు. ఏ ఒక్కనేత చిత్త శుద్దితో ప్రయత్నాలు చేయలేదని.. రైతులను పసుపు బోర్డు పేరిటి మభ్యపెట్టారని అన్నారు. ఎంపీ అర్వింద్ రైతుల పోరాటీనికి అండగా నిలిచి బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డ్ సాధించారని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు.. అయినప్పటికీ నిజామాబాద్‌కి పసుపుబోర్డు రావడం అభినందనీయమని చెప్పారు. 33 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా పని చేసి తనను జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా నియమించిన ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. పసుపు పండించే 20 రాష్ట్రాల్లో పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.