Minister Uttam Kumar Reddy: SLBC టన్నెల్ ప్రమాదంపై BRS ఓవరాక్షన్ చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోతే బీఆర్ఎస్ నేతలు ఎందుకు పరామర్శించలేదని మంత్రి ప్రశ్నించారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్‌బీసీ ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే.. కనీసం అక్కడకు కేసీఆర్ వెళ్లలేదని మంత్రి అన్నారు. మాసాయిపేటలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతే కేసీఆర్ కనీసం అడుగు కదపలేదని చెప్పారు. ఇప్పుడు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: BHEL Recruitment: డిగ్రీ అర్హతతో భెల్‌లో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
‘జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిపుణులతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కూలిపోయిన మట్టిని త్వరగా త్వరగా తీసివేస్తాం. మూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుంది. రెండు మూడు నెలల్లో ఈ టన్నెల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాం. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాటర్ డివాటరింగ్ కు కనీసం విద్యుత్ ప్రొవైడ్ చేయలేని చేతకానితనం బీఆర్ఎస్ ప్రభుత్వానిది’ అని మంత్రి ఫైరయ్యారు.
‘హరీష్ రావు మీ సలహాలు మాకు అవసరం లేదు. మీ కన్నా పెద్ద నిపుణులు టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేస్తున్నారు. తెలంగాణలో జేబులు నింపుకోవడానికి కేసీఆర్ ఇరిగేషన్ శాఖను నాశనం చేశారు. దేవాదుల సీతారాం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు..? ఇవాళ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ అబద్ధం. ఎస్ఎల్‌బీసీ గ్రావిటీ ద్వారా 30 టీఎంసీల వాటర్ వస్తుంటే కూడా పనులు వదిలిపెట్టి పోయారు. టన్నెల్ ఘటనపై అబద్ధపు మాటలు మాట్లాడటం నేను ఖండిస్తున్నా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి హరీష్ రావుకు సిగ్గుండాలి’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే లోపలికి అనుమతించకుండా నియంత పాలన చేశారు. 1.81 లక్ష కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులన్ని నిరూపయోగంగా మారాయి. పూర్తిగా ఇరిగేషన్ ను నాశనం చేసిన ఘనత కేసిఆర్ దే. గతంలో శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రం దగ్గర ఇలాంటి ఘటన జరిగితే లోపలికి ఎవరిని అనుమతించలేదు. ఆరోజు ఆ ఘటనను చూడడానికి వెళుతున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని మధ్యలోనే అరెస్టు చేశారు. కాళేశ్వరంలో ఆరుగురు చనిపోతే దానికి మీరు ఎవరు జవాబు చెప్పలేదు. పాలమూరు రంగారెడ్డిలో పంపు కూలి ఆరుగురు చనిపోతే కనీసం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ దగ్గర చనిపోతే పట్టించుకున్న నాథుడే లేడు’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
ALSO READ: Group-D Jobs: 32000 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే మిత్రమా.. ఆలస్యం వద్దు..!
‘కొండగట్టు బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే వారి కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ప్రగతి భవన్ లో విందులు చేసి కృష్ణానది మీద అక్రమ ప్రాజెక్టులు కట్టారు. కృష్ణా నది నీటి విషయంలో మోసం జరుగుతుంటే చూస్తూ సైలెంట్ గా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డిపై రూ.27,800 కోట్లు ఖర్చుపెట్టి ఇప్పటివరకు ఒక్క ఎకరాకు నీరు ఇవ్వని తీరు మీది. నాకు హెలికాప్టర్ లో తిరగాలన్న ఆసక్తి లేదు. వారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు.