MLC Elections : మోహన్ కి ఆదివారం సెలవు… ఆఫీస్ పనులు కాస్త పక్కన పెట్టేసి రిలాక్స్ అవుతుంటే మోగింది ఫోన్. సమయం కాని సమయంలో ఎవరా అని.. వెళ్లి ఫోన్ చూశాడు. తెలియని నెంబర్ నుంచి వస్తుందా ఫోన్ కాల్.. సర్లే ఎవరు ఏ అవసరంతో చేస్తున్నారో అని ఫోన్ ఎత్తితే.. అవతల నుంచి “నేను మీ కాంగ్రెస్ అభ్యర్థిని, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ ఓటు నాకే వేయండి” అంటూ ఎన్నికల ప్రచార ఫోన్ కాల్. తనను గెలిపిస్తే.. ఏమేం చేస్తారో మొత్తం వివరంగా చెప్పేస్తున్నారు. సర్లే.. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారిపోయిన ప్రచారం అనుకుంటూ.. ఫోన్ కట్ చేస్తే వెళ్ళి అలా టీవీ ముందు కూర్చున్నాడు. నచ్చిన హీరో సినిమాలో మునిగిపోతుండగానే మరోసారి మోగింది ఫోన్.. ఈసారి తెలియని నెంబర్ నుంచి. ఏమో.. ఏ బంధువుల నుంచి వచ్చిందో, ఏ చుట్టాలు కొత్త నెంబర్ నుంచి చేస్తున్నారో అని ఫోన్ ఎత్తితే.. ఈసారి “నేను మీ బిజెపి అభ్యర్థిని” అని ప్రచారం.. సెలవు రోజు ప్రశాంతత లేకుండా.. ఏంటి ఈ గోల అనుకుని చిరాగ్గా ఫోన్ పక్కన పెట్టేసి వెళ్లి కూర్చున్నాడో లేదో… బీఎస్పీ నుంచి మొదలుపెట్టి ఆఖరికి స్వతంత్ర అభ్యర్థుల సైతం ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఇలా.. తన సెలవు రోజు కాస్తా, అన్ని పార్టీల ప్రచారాన్ని వినడంతో సరిపోయింది. ఒక్క మోహన్ పరిస్థితే కాదు.. చాలా మంది ఇప్పుడు ఈ ఫోన్ కాల్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
తక్కువ ఖర్చులోనే ప్రచారం
తెలంగాణలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లోని ఓటర్లను ఫోన్లు ద్వారా సంప్రదిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేందుకు తక్కువ సమయం ఉండడం, తక్కువ ఖర్చులోనే ఎక్కువ మందిని కలిసేందుకు వీలవుతుండడంతో.. ఫోన్ కాల్ ప్రచారానికి అభ్యర్థులు సై అంటున్నారు.
యువత ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతుంటారు. వాళ్లను వ్యక్తిగతంగా కలిసేందుకు అంతగా వీలవదు. అందుకే.. వారి ఫోన్ నెంబర్లను సేకరించి, ఇలా ఫోన్ల ద్వారా అయితేనే సులువుగా, వేగంగా అందరికీ చేరుకోవచ్చు అన్నది అభ్యర్థుల ఆలోచన. ఇలా.. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా ఫోన్ కాల్స్ చేసి ఓట్లు అభ్యర్థించడం కోసం ఏజెన్సీలకు కాంట్రాక్టులు ఇస్తున్నారు. వారే ప్రతీ రోజు ఎంత మందికి చేయాలి, ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ చేయాలో నిర్ణయించుకుని.. వరుస పెట్టి ఫోన్స్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టెలీ కాలర్స్ ను, ఇరత సాంకేతిక సిబ్బందిని సైతం నియమించుకుంటున్నాయి.. ఆయా ఏజెన్సీలు.
సోషల్ మీడియా హోరెత్తిపోతోంది
ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓట్లు వేసేందుకు అర్హులైన ఓటర్ల జాబితా రూపుదిద్దుకుంది. దీంతో.. సోషల్ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడానే లేదు.. అన్ని పార్టీలు ప్రస్తుతం ఇదే పంథాలో ప్రచారాన్ని సాగిస్తున్నాయి. వీరి ప్రచారంలో ఫోన్ కాల్స్ ఒక్కటే కాదు.. ప్రతి ఒక్కరికి టెక్స్ట్ మెసేజ్ ల రూపంలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి రోజూ మూడు, నాలుగు మెసేజ్లు వస్తున్నాయి.
అన్ని పార్టీల అభ్యర్థుల సోషల్ అడ్వర్జైజింగ్ దాడులతో ఒక్కో ఓటరుకు.. ఎలా చూసినా రోజుకు కనీసం 20 నుంచి 50 ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. పైగా.. వీటికి అదనంగా టెక్స్ట్ మెసేజ్లు. దీంతో.. చిరాకెత్తిపోతున్న ఓటర్లు.. పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిలో ఉండి ఫోన్ కట్ చేస్తే.. మళ్లీ, మళ్లీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఆఫీసులో ఏదో హడావిడి పనిలో ఉన్నప్పుడో, ఇంటి పనుల్లో బిజీగా ఉన్నప్పుడో.. కొత్త నెంబర్ల నుంచి ఫోన్లో చేస్తూ.. ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహిస్తున్నారు. సమయం సందర్భం లేకుండా చేస్తున్న ఫోన్ కాల్స్ తో ఆఫీసుల్లో ఉన్నప్పుడు, ఇంటి దగ్గరా.. ప్రశాంతంగా నిద్రపోతున్న సమయాల్లోనూ ఈ ఫోన్ కాల్స్ ఇబ్బందిగా ఉంటున్నాయంటున్నారు.
మోగిపోతున్న ఫోన్లు, వాట్సాప్ గ్రూప్లు..
అన్ని పాార్టీల అభ్యర్థులు ఇలా ఫోన్ కాల్స్ తో ఇబ్బంది పెడుతుండగా… ఇంకో వైపు సోషల్ మీడియా పోస్టులు, మెసేజ్లతో ఓట్లర్లకు నిద్ర లేకుండా చేస్తున్నారని అంటున్నారు. ట్రండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్లు, వీడియోలు, ప్రత్యేకంగా పాటలు రూపొందించి విడుదల చేస్తూ.. అభ్యర్థులు తమ గెలుపు కోసం టెక్నాలజీని గట్టిగానే వినియోగిస్తున్నారు. వాటికి అదనంగా ఇప్పుడు ఫోన్ కాల్స్ రూపంలో మరింత జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.
ఈ ప్రచారంలో.. టెలీ కాల్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మాత్రమే కాదు. లోకల్ లీడర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు అదనం. గ్రామస్థాయిలో ఓట్ల జాబితాను పక్కన పెట్టుకుని ప్రతి ఓటర్ కు ఫోన్ చేసి వారి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అతను గెలవడం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయో చెబుతూ ప్రచారాలు చేస్తున్నారు. వీరి ప్రచారాళ్లతో లోకల్ గా ఉన్న అనేక వాట్సప్ గ్రూపులు.. పార్టీ నేతలు, కార్యకర్తల ఎన్నికల పోస్టులతో నిండిపోతున్నాయి.
Also Read : Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కారిడార్-4, ఆ ప్రాంతాల మీదుగా
ఇలా అన్ని రకాలుగా అభ్యర్థుల నుంచి ఓటర్లకు అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. మారిపోయిన ప్రచారం.. అభ్యర్థులకి అనుకూలంగానే ఉంటున్న ఓటర్లకు మాత్రం లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుత కాలంలో ఎప్పుడు చేతి పక్కన ఉండే ఫోన్.. ఎప్పుడు, ఏరోజు ఎన్నిసార్లు మోగుతుందో తెలియని పరిస్థితిలో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.