BRS : “ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా… ఇంకా నన్ను కష్టపెడతారా? కొందరు పనిగట్టుకొని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయి.. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నా.. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా.. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నా.. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నా.. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా”.. ఇవీ కల్వకుంట్ల కవిత చేసిన లేటెస్ట్ కామెంట్స్. ఈ డైలాగ్స్ సరిపోవా బీఆర్ఎస్‌లో కవితకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో రాజకీయం నడుస్తోందో చెప్పడానికి. ఇంటి గుట్టును ఆమెనే రట్టు చేసేసింది. కవిత వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీలో కాక రేపుతున్నాయి. కారు పార్టీలో కుంపటి రాజుకుందా? కవితకు పొగ బెడుతున్నది ఎవరు? ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నది ఎవరు? కవితను సైడ్ చేస్తే ఎవరికి లాభం? కవిత ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇలా అనేక పాయింట్స్‌పై పొలిటికల్ డిబేట్ నడుస్తోంది.
కవిత ఒంటరి పోరాటం..
జైలు నుంచి వచ్చాక ఎమ్మెల్సీ కవిత ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. గులాబీ జెండా నీడన కాకుండా.. తన తెలంగాణ జాగృతి గొడుగు కింద రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం పెద్ద స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ధర్నాలు గట్రా చేస్తున్నారు. బీసీ వాయిస్‌తో ఉద్యమిస్తున్నారు. ప్రజలంతా సామాజిక తెలంగాణ కోరుకుంటున్నారంటూ సంచలన కామెంట్స్ కూడా చేశారు కవిత. సామాజిక తెలంగాణ కావాలంటే.. దొరల పాలన వద్దనేగా మీనింగ్? అంటే, మరోసారి కేసీఆర్ పాలన రాకూడదనేగా కవిత మాటలకు అర్థం? అని అంటున్నారు.
కవిత సొంత అజెండా?
కవిత చేస్తున్న ప్రతీ నినాదం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేదే అంటున్నారు. పదేళ్లు కేసీఆరే సీఎంగా ఉన్నారు. అప్పుడు ఎందుకు పెట్టలేదు ఫూలే విగ్రహం అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఇది కేసీఆర్‌ను ఇరుకున పెట్టే విషయంగా మారింది. మరోవైపు, తెలంగాణ కుటుంబ సర్వేను కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు కులగణన సర్వేకు కుటుంబ వివరాలు ఇవ్వలేదు. కవిత ఒక్కరే తన ఫ్యామిలీ డీటైల్స్ ఇచ్చి కులగణనకు సహకరించారు. ఈ పరిణామంతో పార్టీలో, కల్వకుంట్ల కుటుంబంలో చీలిక వచ్చిందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. అంటే, కేసీఆర్ ఫ్యామిలీలో కుమ్ములాటలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కవిత తన సొంత అజెండాతో రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. కేటీఆర్, హరీష్‌రావులతో వేదిక పంచుకోకుండా.. జాగృతి జెండాతోనే ప్రజల్లోకి వెళ్లడాన్ని ఎలా చూడాలి? అన్నాచెల్లిల మధ్య పొలిటికల్ వార్ నిజమేనా?
అన్నాచెల్లి వార్?
కేసీఆర్ వారసుడు కేటీఆర్. గులాబీ దళం మొత్తాన్ని ఆ విధంగా ఫిక్స్ చేశారు. మొదట్లో హరీష్‌రావు ట్రై చేసినా.. ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా సక్సెస్‌ఫుల్‌గా తొక్కేసి.. కేటీఆరే నెక్ట్స్ బాస్ అనే మెసేజ్ పార్టీ కేడర్‌కు బలంగా చాటారు గులాబీ దళపతి. అప్పటి నుంచి హరీష్ అడ్జస్ట్ అవుతున్నారు. కేటీఆర్ చాటు రాజకీయాలు చేస్తున్నారు. కవిత మాత్రం అలా కాదు. అన్నతో పోటాపోటీగా సై అంటున్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చాక.. మరింత యాక్టివ్ అయ్యారు. అయితే, పార్టీ తరఫున కాకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే బీసీ నినాదం ఎత్తుకోవడం, ఫూలే విగ్రహం ఏర్పాటు.. సామాజిక తెలంగాణ స్లోగన్‌తో పక్కా యాంటీ బీఆర్ఎస్ పాలిటిక్స్ చేస్తున్నారనే వాదన అయితే ఉంది. ఇదే సమయంలో గులాబీ పార్టీలో కవితకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఆమె మీటింగ్స్‌కు, ధర్నాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ వెళ్లకుండా పార్టీ పెద్ద కట్టడి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన కవిత.. గులాబీ అండా దండా జెండా లేకుండానే నెగ్గుకురావాలని, సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లేటెస్ట్‌గా కవిత మండిపడ్డారు. ఆర్నేళ్లు జైల్లో ఉన్నది సరిపోదా.. ఇంకా నన్ను కష్టపెడతారా? రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా.. అంటూ పార్టీకే వార్నింగ్ ఇచ్చారని.. పరోక్షంగా కేటీఆర్‌కే సవాల్ విసిరారని చెబుతున్నారు. మరి, అన్నాచెల్లిల వార్ ఫ్యూచర్‌లో ఏ టర్న్ తీసుకుంటుందో.
Also Read : పాక్‌కు మద్దతుగా పోస్ట్.. తెలంగాణ స్టూడెంట్ సస్పెండ్
కాంగ్రెస్ కౌంటర్
ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించింది. బీఆర్ఎస్ మూడు ముక్కలు, నాలుగు చెక్కలుగా మారబోతోందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. కవిత, హరీష్ రావులను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించాలని కేటీఆర్ చూస్తున్నారని చెప్పారు. గతంలో విజయశాంతి, ఆలే నరేంద్రలను పార్టీ నుంచి బయటకు పంపినట్లే కవితను కూడా బయటకు పంపుతారని అన్నారు. కరివేపాకులా కవితను చూస్తున్నారని.. పార్టీలో విలువ, గౌరవం లేకపోవడం వల్లనే కవిత అలా మాట్లాడుతున్నారని అన్నారు.