BigTV English

MP Bandi Sanjay : బండి సంజయ్ లో ఈ మార్పుకు కారణమేంటి.. ఇన్నాళ్లు కొట్లాడి ఇప్పుడెందుకు వదిలేశాడు.

MP Bandi Sanjay : బండి సంజయ్ లో ఈ మార్పుకు కారణమేంటి.. ఇన్నాళ్లు కొట్లాడి ఇప్పుడెందుకు వదిలేశాడు.

MP Bandi Sanjay : రాష్ట్ర బీజేపీలో చాన్నాళ్లుగా సఖ్యత లేదనే విషయం బహిరంగ రహస్యమే. పార్టీ పదవుల దగ్గర నుంచి కేంద్ర పెద్దల దగ్గర పనుల వరకు చాలా మంది కీలక నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. సరిగా ఇదే తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ పదవుల విషయంలో స్పందించిన సంజయ్.. తనకు కేంద్రంలో పెద్ద బాధ్యతలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో.. ఇటు రాష్ట్ర నాయకులకు అటు కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్ర నేతలకు చురుక అంటించారా అనే చర్చ జరుగుతోంది. తన అయిష్టతను తెలపడం వరకు ఒకెత్తు అయితే.. తాను కేంద్రం మనిషి అన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటని చర్చించుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్రాల్లో మరో కీలక నేతకు తగిలివచ్చేలా ఉన్నాయంటున్నారు. ఇంతకీ.. బండి ఏమన్నారు. ఆయన మాటలు ఏ నేత అభిమానులకు కోపం తెప్పించేలా ఉన్నాయంటే..


ఎన్నికల ముందు వరకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు బండి సంజయ్ చేతిలో ఉన్నాయి. దాంతో.. జిల్లా అధ్యక్షుల ఎంపిక నుంచి రాష్ట్ర స్థాయి పదవుల ఎంపికల వరకు పవర్ చూపించారు. పైగా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి అప్పటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. కానీ.. ఏమైందో ఏమో కానీ ఎన్నికలు కీలక  దశకు చేరుకున్నాక రాష్ట్ర అధ్యక్ష పదవి ఊడిపోయింది. ఈ విషయంలో రాష్ట్ర క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినా.. కేంద్రం మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. సరికదా.. బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని తీసుకువచ్చి రాష్ట్ర అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయంటారు. అవి ఇప్పుడు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. అయినా గతంలో కంటే మెరుగైన స్థానాలనే గెలుచుకుంది. ఇక.. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఓడిపోయారు. దాంతో.. వారు ఎంపీలుగా గెలుపొంది కేంద్ర మంత్రి పదవులు దక్కించుకున్నారు. దాంతో వారికి కేంద్రంలో బాధ్యతలు పెరిగిపోయాయి. ఈ సమయంలోనే రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష పదవిని రాష్ట్ర నేతతో భర్తీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు పార్టీ పదవిని కట్టబెట్టాలనే.. అప్పుడే నాయకులు సమర్థవంతంగా ప్రజల్లోకి వెళతారనే వాదన ఉంది. కానీ.. కేంద్రం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పదవికి బండి సంజయ్ పోటీలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.


నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను అంటూ ప్రకటించారు. పార్టీ నాయకత్వం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిందని వ్యాఖ్యానించిన బండి సంజయ్.. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ ప్రకటించారు. అంటే.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిలోనే తనకు చాలా పనులున్నాయన్న బండి.. రాష్ట్ర పార్టీ స్థితిగతుల్ని మెరుగుపరిచే బాధ్యతల్ని వేరే వారికి అప్పగిస్తే మేలని చెప్పుకొచ్చారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని కొట్టిపారేశారు.

రాష్ట్రంలో కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. తనకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హై కమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తమ పార్టీలో రాష్ట్ర స్థాయిలో సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీ అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారని చెప్పిన బండి సంజయ్.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరని తెలిపారు. ఒకసారి కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ దానికి కట్టుబడి ఉంటారని తెలిపారు.

బండి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి

కేంద్ర మంత్రిగా తనకు చాలా పనులున్నాయని వ్యాఖ్యానించిన బండి సంజయ్.. ఈ బాధ్యతల్ని వేరే వాళ్లకు అప్పగించాలని సూచించారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు తనను ఆ పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి అప్పగించడంతో అప్పట్లో బండి అలకపూనారు. చాన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంజయ్.. మళ్లీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు స్తబ్దుగా ఉండి పోాయారు. ఇప్పటికీ.. పార్టీ కేంద్ర నాయకుల నిర్ణయంపై అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే.. కేంద్రంలో పనులున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న సంజయ్ రాష్ట్ర పదవి చేపట్టేందుకు సమయం లేకపోతే.. ఇక పూర్తి స్థాయి కేంద్ర మంత్రిగా కీలక శాఖలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి సరైంది కాదనే ఉద్దేశ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజా వ్యాఖ్యాల ద్వారా కిషన్ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి వేరే వాళ్లకు అప్పగించాలని బండి సంజయ నర్మ గర్భంగా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

పార్టీలో సపోర్టు కోసం ప్రయత్నమా?

కేంద్రంలో పదవులు అనుభవిస్తూనే.. రాష్ట్రంలోనూ కీలక పదవి చేపట్టడాన్ని రాష్ట్ర స్థాయి నేతల నుంచి నిరసన ఉంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర నాయకుల నుంచి మద్ధతు ఆశిస్తున్నారని భావిస్తున్నారు. తాజా మాటలతో తాను పోటీ పడడని స్పష్టం చేయడంతో పాటు మిగతా కీలక నేతలు తప్పుకోవడమే ఉత్తమమనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లైంది. దీంతో.. తమ తర్వాతి నాయకుల మెప్పు పొందడంతో పాటు వారికి అవకాశాలు రావాలని బండి ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు పంపారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో పాటుగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టి పార్లమెంట్ లో అడుగు పెట్టిన ఈటల రాజేంద్ర, రఘునందన్ వంటి వారికి సానుకూల సంకేతాలు ఇచ్చినట్లైందంటున్నారు. వారే కాదు.. పార్టీలో, బయట మంచి గుర్తింపు సాధించిన మహేశ్వర్ రెడ్డి, కాటేపల్లి వెంటక రమణా రెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి వంటి వారికి లైన్ క్లియర్ చేయడం ద్వారా వారిని తన వర్గంలో చేర్చుకునేందుకు బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×