Ramchander Rao: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ బండారం బయటపడకుండా నాటకాలు ఆడుతున్నాయని, వారి మధ్య అంతర్గతంగా ‘క్విడ్ ప్రో కో’ ఉందనే అనుమానం కలుగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇరు పార్టీల వైఫల్యాల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడమే కాకుండా, రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యం
రాష్ట్రంలో ప్రతి ఏటా పంట నష్టపోయి రైతులు అల్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వ ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకంతో లబ్ధి పొందుతుంటే.. 2019 నుంచి కేసీఆర్ సర్కార్ దీనిని పక్కన పెట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పినా, సమయానికి ప్రీమియం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్ నినో వల్ల కరువు పరిస్థితులు వస్తాయని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని, కేంద్రం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం లేదని స్పష్టం చేశారు.
జూరాల ప్రాజెక్టు సందర్శన
ప్రస్తుతం జూరాల ఆయకట్టు కింద నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టులో సరిపడా నీరున్నా దిగువకు విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు. కర్ణాటక నుంచి అదనపు నీటిని విడుదల చేయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రైతుల నిజమైన సమస్యలను తెలుసుకోవడానికి, ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను బట్టబయలు చేయడానికి తాము త్వరలోనే జూరాల ప్రాజెక్టును సందర్శిస్తామని ప్రకటించారు.
హుస్సేన్ సాగర్‌లోనే వినాయక నిమజ్జనం
తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం వినాయక సాగర్ (హుస్సేన్ సాగర్)లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం జరపాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. బ్యాక్ వాటర్‌లో నిమజ్జనం పేరిట ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా నిరసించారు. నగరం నలుమూలల నుంచి లక్షకు పైగా విగ్రహాలు వస్తాయని, నిమజ్జనం పూర్తయ్యాక వ్యర్థాలను త్వరగా తొలగిస్తే పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు.
Also Read: రొయ్యలు, బిర్యానీలు తిని నీళ్లను రాయలసీమకు అప్పగించారు.. KCRపై జూపల్లి సంచలన వ్యాఖ్యలు!