Tata Aeris Launch: టాటా మోటార్స్ తన కొత్త సెడాన్‌పై ఆసక్తిని పెంచుతోంది. టాటా ఏరిస్ పేరుతో రాబోతున్న ఈ కారుకు సంబంధించ లాంచ్ డేట్ ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 25న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టిగోర్ ఫేస్ లిఫ్ట్ కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఏరిస్ రానున్నట్లు వెల్లడించింది. ఆవిష్కరణకు ముందు కారు గురించి పలు వివరాలను కంపెనీ వెల్లడించింది.
టాటా ఏరిస్ ముందు భాగంలో టిగోర్ తో పోలిస్తే కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో సన్నని LED హెడ్‌ల్యాంప్‌లకు పైన ప్రత్యేకమైన DRL స్ట్రిప్‌ను ఏర్పాటు చేశారు. టీజర్ లో కనిపించిన మరో ముఖ్యమైన మార్పు LED ఫాగ్ ల్యాంప్స్. ఇవి ప్రస్తుత టిగోర్‌లో అందుబాటులో లేవు. వెనుక భాగంలో కూడా రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉండనున్నాయి. డోర్లకు సాంప్రదాయ పుల్ టైప్ హ్యాండిల్స్ ను కొనసాగించారు.
గతంలో బయటకు వచ్చిన డిజైన్ పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే ఏరిస్ వెనుక బంపర్ కు రెండు వైపులా రిఫ్లెక్టర్లు ఉండే అవకాశం ఉంది. టిగోర్ తరహాలోనే నాచ్ బ్యాక్ స్టైల్ రూఫ్ లైన్‌ను ఇందులో కొనసాగించనున్నారు. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉండొచ్చు. వీటి పరిమాణం 15 అంగుళాలుగా ఉండే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్ట్ అయినప్పటికీ కేవలం బంపర్లు, లైట్ల మార్పులతో సరిపెట్టకుండా కొన్ని షీట్ మెటల్ మార్పులు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, CNG మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా దాదాపు ఒకే డిజైన్ ను అనుసరించే అవకాశం ఉంది. అయితే EVలో ప్రత్యేకమైన కొన్ని డిజైన్ మార్పులు కనిపించవచ్చు.
ఏరిస్ క్యాబిన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టాటా ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇటీవల అప్ డేట్ అయిన టియాగో ఇంటీరియర్ డిజైన్ నుంచి కొన్ని అంశాలను కొత్త సెడాన్‌లో తీసుకునే అవకాశం ఉంది. కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ వంటి మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ ORVMలు, వెనుక AC వెంట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పవర్‌ట్రెయిన్ విషయంలో టిగోర్‌లో ఉన్న సెటప్‌నే ఏరిస్‌లో కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, అలాగే పెట్రోల్-CNG ఆప్షన్ ఉండొచ్చు. రెండింటికీ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. ఏరిస్ EV విషయానికి వస్తే, టియాగో EV నుంచి 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్‌లు తీసుకునే అవకాశం ఉంది. BaaS ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫేస్‌లిఫ్ట్ కారణంగా ఏరిస్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం టిగోర్ ధర రూ.5.55 లక్షల నుంచి రూ.8.84 లక్షల వరకు ఉండగా, టిగోర్ EV ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల వరకు ఉంది.
Read Also: టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. లుక్ అదిరింది భయ్యా!