Sand Mafia: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లయితే, ఫిర్యాదులు చేసేందుకు రెండు నెంబర్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఇసుక కొరత ఉన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మైనింగ్
శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్ వివరించారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ గృహాల లబ్దిదారుల ఎంపిక పూర్తయింది. ప్రభుత్వం ప్రతి లబ్దిదారునికి రూ. 5 లక్షలు అందించనుంది. అలాగే లబ్దిదారుల ఇసుక కష్టాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఇటీవల ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే కరెక్ట్ సమయం అనుకున్న కొందరు ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ రవాణా సాగిస్తున్నారట. ఇటువంటి చర్యలతో అసలైన లబ్దిదారులకు ఇసుక కొరత రానుంది. అందుకే మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్ కీలక ప్రకటన చేశారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇసుక సప్లై పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అక్రమ ఇసుక రవాణా కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు. అక్రమ ఇసుక రవాణాకు సహకరించే అధికారుల పై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఇసుక లోడింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, తెలంగాణ ఆరు జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎక్కువగా ఇసుక వస్తుందన్నారు. సీఎం ఆదేశం తర్వాత 1529 వెహికల్స్ చెక్ చేసి 136 కు పైగా కేసులు, 111 వెహికల్స్ సీజ్, 21 డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు.
కరీంనగర్, ములుగు, పెద్దపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో సోదాలు చేశామని, ఓవర్ లోడెడ్ తో ఇసుక తరలిస్తున్న వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెడతామన్నారు. 24 గంటల పాటు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చామని, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవన్నారు. రాబోయే 40 రోజుల్లో అన్ని చోట్ల సీసీటీవీ, ప్రతీ జీపీఎస్, వేవ్ బ్రిడ్జిలు ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. కంప్లైంట్ చేయడానికి నంబర్స్ 9848094373, 7093914343 ఏర్పాట్లు చేసామని, ఎవరైనా ఎలాంటి ఫిర్యాదులైనా చేయవచ్చని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు.
Also Read: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. కోట్లల్లో విరాళం అందించిన ఆ భక్తుడెవరంటే?
స్టేట్ లెవల్ లో అన్ని శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసామని, జెన్యూన్ గా చేసే వాళ్లకు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు ఉంటాయని, కాళేశ్వరం ప్రాజెక్టులో బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. ఇసుక ద్వారా గత ఏడాది రెవెన్యూ రూ. 567 కోట్లు రాగా, ఈ ఏడాది 627 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేదని, లబ్దిదారులు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు.