Naga Panchami: పాము అని పేరు వినగానే అమ్మో అని భయపడిపోతుంటాము.. కానీ అంతలా భయపడిన పాముకు మళ్లీ మన హిందు సాంప్రదాయం ప్రకారం పూజిస్తాము కూడా.. అన్ని రోజులు ఎంతో భయంతో చూసి ఇంటి చుట్టు పక్కలికి వస్తే తరిమెసే పాము.. నాగుల పంచమి, నాగుల చవితి రోజూ మాత్రం ఎంతో భక్తితో పూజిస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే..
హైదరాబాద్‌లో నాగుల పంచమి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (GHSPCA) పాముల రక్షణలో గణనీయమైన కృషి చేసింది. ఈ సంస్థ, పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) సహకారంతో, ఇప్పటివరకు 5,276 పాములను రక్షించింది. నగరంలోని శాలిబండ, హుస్సేనీ ఆలం, గౌలిపుర, బేగంబజార్, దాద్‌భౌలి, లాల్‌దర్వాజ, రాంకోఝి, మొఘల్‌పురా వంటి ప్రాంతాల్లో దాడులు చేసి, ఈ పాములను సురక్షితంగా రక్షించారు.
నాగుల పంచమి సమయంలో కొందరు వ్యక్తులు నాగుపాములను పట్టుకొని క్రూరంగా వ్యవహరిస్తున్నారని GHSPCA గుర్తించింది. పాముల కోరలను తొలగించడం, విష గ్రంథులను దెబ్బతీయడం, నోరు కుట్టడం వంటివి చేస్తున్నారు. ఇంకా, ఈ పాములను చీకటి, ఇరుకైన ప్రదేశాల్లో ఆహారం లేకుండా ఉంచడం వల్ల అవి తీవ్ర బాధలు అనుభవిస్తాయని, చాలా వరకు మరణిస్తున్నాయని కొందరు వ్యక్తులు తెలిపారు. ఈ క్రూరత్వాన్ని నిరోధించేందుకు GHSPCA వాలంటీర్లు నిరంతరం కృషి చేస్తున్నారు.
అయితే రక్షించిన పాములకు తగిన చికిత్స అందించి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వాటిని అడవుల్లో సురక్షితంగా విడిచిపెడుతున్నారు. ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాములను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ, వాటి సహజ ఆవాసంలోకి తిరిగి చేర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాముల పట్ల సమాజంలో అవగాహన కల్పించడం, వాటిని రక్షించడం లక్ష్యంగా GHSPCA పనిచేస్తోంది.
Also Read: వామ్మో.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
నాగుల పంచమి వంటి సాంస్కృతిక సందర్భాల్లో పాములను హింసించడం తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా, జంతు సంరక్షణ పట్ల సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు GHSPCA నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు.