Narayanpur Dam: నారాయణపూర్ డ్యామ్ నుంచి తెలంగాణకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల వినతి సమర్పించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, జలవనరుల శాఖ మంత్రి చెలువరాయస్వామిలతో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సమావేశ మయ్యారు. పాలమూరు ప్రాజెక్టులకు విడుదల చేయాల్సిన నీటిపై సీఎంతో ప్రధానంగా చర్చించారు. తెలంగాణ విజ్ఞాపనలకు సానుకూలంగా సీఎం శివకుమార్ స్పందించారు.
జూరాల నీటి విడుదల కోసం వెంటనే స్పందించి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం కలిసింది. మంత్రి వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కూడిన బృందం కర్ణాటక సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
దక్షిణ తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధి బృందం.. కృష్ణా నదిపై ఉన్న నారాయణపూర్ డ్యామ్ నుంచి తెలంగాణకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులకు తక్షణం నీటి అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నారాయణపూర్ నుంచి నీటి విడుదలకు సహకరించాలని కోరింది. ఈ సమావేశంలో కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి చెలువరాయస్వామి, మాజీమంత్రి, శాసనమండలి పక్షనేత ఎన్ ఎస్ బోసురాజు, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరవ్ గుప్తా, తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి పాల్గొన్నారు.
Also read: దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్
కర్ణాటక–తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అవగాహన, నిర్మాణాత్మక చర్చల ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావులు తెలిపారు. కర్ణాటక సీఎం తెలంగాణ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బృందాన్ని ఆహ్వానించి, విజ్ఞపనలకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక ప్రభుత్వం, అధికారులకు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావులు కృతజ్ఞతలు తెలిపారు.
పాలమూరు రైతుల పంటలకు సాగునీరు కావాలనే తెలుపగానే స్పందించి, కర్ణాటక సీఎంతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా జూరాలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు లేఖ రాసిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు.
Also read: ఫ్రెండ్ కోసం ఫేక్ డేటింగ్… ప్రొఫెసర్‌తో ఆ పనిదాకా వెళ్తే… ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులోనే