Narcotics Bureau: ఇటీవల హైదరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (H-NCB) చేపట్టిన ఓ భారీ ఆపరేషన్‌లో.. పబ్‌లు, పార్టీల పేరుతో నడుస్తున్న మాదకద్రవ్యాల వ్యవహారంపై.. పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ వినియోగం, సరఫరా, అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగేందుకు.. పబ్‌లలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
డ్రగ్స్‌కు ప్రత్యేక గదులు..!
పబ్‌లు బయటంతా గ్లామర్, సంగీతం, డ్యాన్స్‌తో వినోదం కనిపించినా.. పక్కనే ఉండే గదుల్లో మాత్రం యువత మత్తులో మునిగిపోతున్న దృశ్యాలు.. నార్కోటిక్ అధికారులను షాక్‌కు గురిచేశాయి. ఈ గదులు ప్రత్యేకంగా కొకైన్, ఎంఎడీఎంఏ (MDMA), ఎల్ఎస్డీ (LSD) వంటి సింథటిక్ డ్రగ్స్‌ను తీసుకునే వారికి ఉపయోగపడేలా డిజైన్ చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ గదుల్లో సీసీ కెమెరాలు లేకుండా, డ్రగ్స్ వినియోగాన్ని గుట్టుగా ఉంచే ప్రయత్నం చేశారు.
నైజీరియన్ డ్రగ్ నెట్‌వర్క్ పై దృష్టి
అధికారుల దర్యాప్తులో మరో కీలక విషయాలు బయటపడ్డాయి. నైజీరియన్ ముఠా దేశవిదేశాల్లో ఉన్న కొరియర్ సర్వీసుల ద్వారా.. డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. సింథటిక్ డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో రహస్యంగా కొరియర్ ద్వారా పంపించి, వాటిని స్థానిక బ్రోకర్లు, మాదకద్రవ్య వ్యాపారులు అందుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు వంటి నగరాల నుంచి హైదరాబాద్‌కు తరలించబడుతున్నాయని అనుమానిస్తున్నారు.
సూర్య స్టేట్‌మెంట్ కీలకం
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సూర్యను పోలీసులు విచారించగా, పలు కీలకమైన విషయాలను వెల్లడించాడు. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ పబ్‌లు, లౌంజ్‌లలో కొకైన్ వినియోగం సాధారణమైపోయిందని చెప్పిన సూర్య, కొన్ని పేర్లు కూడా వెల్లడించినట్లు సమాచారం. అతని స్టేట్‌మెంట్ ఆధారంగా అధికారులు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న.. పబ్‌లపై దాడులు చేపట్టి, సీసీటీవీ ఫుటేజ్, డ్రగ్ ట్రేసులు, ల్యాబ్ నివేదికలు ఆధారంగా మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
25 మందిపై కేసులు, దర్యాప్తు కొనసాగుతోంది
ఇప్పటివరకు మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు నార్కోటిక్ విభాగం అధికారులు తెలిపారు. వీరిలో పబ్ మేనేజర్లు, డ్రగ్స్ సరఫరాదారులు, కొరియర్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. కొంతమంది మాదకద్రవ్యాలను కొనుగోలు చేసిన యువత కూడా విచారణకు పిలవబడ్డారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడెక్కడ పని చేస్తున్నారన్నదానిపై అధికారులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు.
యువతకు హెచ్చరిక
ఈ తరహా ఘటనలు రాష్ట్రంలో యువత.. ఎంత మత్తు వినియోగంలోకి జారిపోతున్నారో స్పష్టంగా చూపిస్తున్నాయి. నగరంలో పార్టీలు, నైట్ లైఫ్ పేరుతో నడుస్తున్న పబ్‌లు ప్రమాదకర దశలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మత్తు వల్ల ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు.. భవిష్యత్ కూడా బలైపోతుందని నార్కోటిక్ విభాగం హెచ్చరించింది.
Also Read: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
మరిన్ని దాడులు తక్షణమే
సూర్య చెప్పిన సమాచారం ఆధారంగా ఇంకా పలు పబ్‌లు, లాంజ్‌లపై దాడులు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ వినియోగం పై తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు.. నార్కోటిక్ విభాగం ఇప్పటికే ప్రత్యేక బృందాలను నియమించింది.