Erravalli Lands: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన.. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల భూములపై తీగలాగితే డొంక కదిలింది. ఎర్రవెల్లి ప్రాంతంలో రెవిన్యూ అధికారులు చేసిన సర్వేపై సమీక్షించారు ముఖ్యమంత్రి. 45 ఎకరాల భూములపై రేపో మాపో కేసీఆర్‌కు రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ వ్యవహారం రేపటి రోజున ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు నేతలు.
అసెంబ్లీ వేదికగా గత నెల సెప్టెంబర్ 16న.. 22ఏ భూములపై చర్చలో సందర్భంగా కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు, భూముల వివరాలు బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఆయా భూముల విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు, పలుమార్లు సర్వే నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవల్లి-శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే ముగిసింది. రికార్డు ప్రకారం అందులోని 45 ఎకరాలు మిస్సింగ్ అయినట్టు తేలింది.
ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా పనిలో పనిగా ఎర్రవెల్లి భూములపై చర్చించారు. సమీక్షలో పాల్గొన్న అధికారులు క్షేత్రస్థాయి వివరాలను వెల్లడించారు. ఆచూకీ లభించని 45 ఎకరాల భూములు ఎక్కడున్నాయో తేల్చాలని అధికారులను ఆదేశించారు. సర్వేలో ఆచూకీ కానీ భూముల గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్దేశించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 325లో 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది.
తాజా సర్వేలో 343 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. మొత్తానికి 45 ఎకరాల తేడా కనిపించింది. ఆ ప్రాంతంలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్నాయి. వారి భూముల రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేస్తామన్నారు అధికారులు. 325 సర్వే నంబరులో గుర్తించిన భూములను స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాల కోసం అక్కడ తెలంగాణ అమరవీరుల కాలనీని నిర్మించాలని డిసైడ్ అయ్యారు.
ALSO READ: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!
అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి అన్ని మౌలిక సదుపాయాలతో కాలనీని అభివృద్ధి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని, వచ్చే జూన్ రెండు నాటికి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేసీఆర్ ఫ్యామిలీ వారికి సంబంధించిన భూముల వివరాలు ఇస్తుందా? అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కీలక నేతలు అర్ధరాత్రి భేటీ అయినట్టు తెలుస్తోంది. భూముల పత్రాలు ఇచ్చేబదులు, న్యాయస్థానం ద్వారా తేల్చుకోవాలని భావిస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. మొత్తానికి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.