Weather News: తెలంగాణలో పలు ప్రాంతాల్లో గత మూడు, నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు నాన్‌స్టాప్‌గా వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటల సేపు కుండపోత వాన కురిసింది. దీంతో వాహనదారులు, సెకండ్ షిప్ట్ ఉద్యోగం పూర్తి చేసుకున్న ఎంప్లాయ్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. నగరంలో రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులకు ఎక్కడ బొందలు, మ్యాన్ హోల్స్ ఉన్నయో తెలియని పరిస్థితి నెలకొంది. హైటిక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్, తార్నాక, ముషీరాబాద్, నారాయణ గూడ, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని అంటున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ, రాత్రి వేళ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు సౌత్, వెస్ట్ తెలంగాణ జిల్లాలైన గద్వాల, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
ALSO READ: DSSSB Jobs: ఇంటర్ అర్హతతో 1180 జాబ్స్.. ఈ జాబ్ వస్తే భారీ సంపాదన.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే
మరి కాసేపట్లో రాష్ట్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. ఇక హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ALSO READ: UPSC Jobs: యూపీఎస్సీలో 213 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు పడే జిల్లా, ప్రాంత ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. చెట్ల మీద పిడుగులు పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చెట్ల కింద నిలబడొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.