వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు రోగులకు గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులను అంబులెన్సులు, మెట్రో రైళ్లు, లేదంటే విమానాల్లో అత్యవసరం తరలించడం చూస్తుంటాం. కానీ, తాజాగా అంతకు మించి ఓ ఆశ్చర్యకరమైన ఆపరేషన్ జరిగింది. దేశంలోని వైద్యులంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ ఆపరేషన్? ఎందుకు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లోని 16 నెలల శిశువుకు టెలీ సర్జరీ చేశాడు. ఓ డాక్టర్. ప్రపంచంలోనే టెలీ సర్జరీ చేయించుకున్న అత్యంత చిన్న వయసు శిశువుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హైదరాబాద్ లో ఉన్న శిశువుకు గుర్గావ్ నుంచి డాక్టర్ వి చంద్రమోహన్ స్వదేశీ SSI మంత్ర రోబోట్ ని ఉపయోగించి రిమోట్ ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. 5G టెక్నాలజీ ద్వారా సుమారు గంటపాటు ఈ ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్సలో పుట్టుకతో వచ్చిన మూత్రపిండాల అడ్డంకిని సరి చేశారు.
హైదరాబాద్ లో ఉన్న శిశువుకు సుమారు 1700 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుర్గావ్ నుంచి రోబోటిక్ శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి అని డాక్టర్లు చెప్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ వి చంద్రమోహన్ గుర్గావ్ లో ఉంటున్నారు. ఆయన అక్కడి నుంచే స్వదేశీ SSI మంత్ర రోబోట్ ద్వారా శిశువుకు రిమోట్‌గా శస్త్రచికిత్స చేశారు. “ఆ శిశువు పుట్టుకతోనే మూత్రపిండ వ్యాధితో జన్మించింది. దీనిలో మూత్ర నాళాన్ని కలిపే మూత్రపిండ కటి భాగం మూసుకుపోయింది. ఫలితంగా.. మూత్రం మూత్రపిండం నుంచి మూత్రాశయానికి ప్రవహించలేకపోయింది. శిశువును కొండాపూర్ లోని ప్రీతి కిడ్నీ ఆసుపత్రిలో చేర్చారు. నేను గుర్గావ్ లోని SSI మంత్ర కార్యాలయంలోని కన్సోల్ లో కూర్చుని రిమోట్ గా శస్త్రచికిత్స చేసాను. సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ అయ్యింది” అని డాక్టర్ చంద్రమోహన్ చెప్పారు.
5G టెక్నాలజీ, రోబోటిక్ వ్యవస్థల ద్వారా ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లు డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం సుమారు గంట సమయం పట్టిందన్నారు. “ఇంతకు ముందు, చైనాలో 8 ఏళ్ల పిల్లవాడికి ఇలాంటి టెలిసర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మేం కేవలం 16 నెలల చిన్నారికి నిర్వహించాం. ప్రపంచంలోనే అతి చిన్న వయసు శిశువుకు టెలిసర్జరీగా చేసిన ఘనత మాకే దక్కింది. ఆపరేషన్ అయిన మరుసటి రోజు శిశువును డిశ్చార్జ్ చేశాం” అని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు. అటు ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లోని ఒక మహిళ గర్భాశయ తొలగింపు తర్వాత మూత్ర లీకేజీతో బాధపడింది. ఆమె ప్రీతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆమెకు కూడా 5G కనెక్టివిటీ, SSI మంత్ర రోబోటిక్ వ్యవస్థ ద్వారా, డాక్టర్ చంద్రమోహన్ రిమోట్‌గా శస్త్రచికిత్స చేశారు. ఈ ఆపరేషన్ ఒక గంటా 20 నిమిషాలు కొనసాగిందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.
Read Also: ఈ రెస్టారెంట్ లో ఎటు చూసినా కండోమ్సే, ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్లొచ్చు!