Telangana News : ప్రేమ్ సాగర్. బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ బేకరీలో పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బులో కొంత ఇంటికి పంపిస్తున్నాడు. ఆయన సంపాదన మీదనే కుటుంబం ఆధారపడి బతుకుతోంది. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం. గత వారం అతని నానమ్మ చనిపోయింది. సెలవులు దొరకలేదు. అంత్యక్రియలకు రాలేకపోయాడు. గల్ఫ్ బతుకులు అంటే అలానే ఉంటాయి మరి. ఆ బాధ నుంచి కోలుకోక ముందే మరో బ్యాడ్ న్యూస్. ప్రేమ సాగర్ బావకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. తీవ్రంగా గాయపడ్డాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చావుబతుకులతో పోరాడు తున్నాడు. ఇదేంది దేవుడా? ఒకేసారి కుటుంబంలో రెండు దారుణ ఘటనలు అంటూ దుబాయ్‌లో ఉంటూనే తీవ్ర కలత చెందాడు ప్రేమ్ సాగర్. కానీ, ఈసారి అంతకుమించి విషాదం జరగబోతోందనే విషయం అప్పటికి అతనికి తెలీదు.
పాకిస్తాన్ యువకుడు అటాక్
ఎప్పటిలానే తాను పని చేస్తున్న బేకరీకి వెళ్లాడు. రోజూ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. తనతో పాటు అదే బేకరిలో ఓ పాకిస్తాన్ యువకుడు కూడా వర్క్ చేస్తుంటాడు. ప్రేమ్ సాగర్‌తో సరదాగానే ఉంటాడు. కానీ, ఆ రోజు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ వాగ్వాదం గొడవగా మారింది. రెచ్చిపోయిన ఆ పాకిస్తానీ యువకుడు.. ప్రేమ్ సాగర్‌పై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. స్పాట్‌లోనే చనిపోయాడు.
శోకసంద్రంలో కుటుంబం
ప్రేమ్ సాగర్ మరణ వార్త తెలిసి.. అతని కుటుంబం షాక్‌కు గురైంది. బతుకు తెరువు కోసం దుబాయ్ వెళితే.. అక్కడే చనిపోయాడని తెలిసి బోరున విలపిస్తోంది. వారం రోజుల గ్యాప్‌లో ఆ ఫ్యామిలీలో మూడు విషాద సంఘటనలు జరగడంతో వారిని ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. నానమ్మ చనిపోవడం, బావకు మేజర్ యాక్సిడెంట్ జరగడం.. ఇప్పుడు ప్రేమ్ సాగర్ పాకిస్తానీ చేతిలో హత్యకు గురికావడం. ఆ కుటుంబానికి ఒకేసారి ఇంతటి దారుణం జరగడం స్థానికులతో కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రేమ్ సాగర్ డెడ్‌బాడీని గల్ఫ్ నుంచి.. అతని స్వగ్రామమైన నిర్మల్ జిల్లా సోన్ మండలానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : లావణ్య కేసులో మస్తాన్ సాయి.. ఆ దర్గా సీజ్?
రంగంలోకి బండి సంజయ్
ప్రేమ్ సాగర్ హత్య ఉదంతం తెలిసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులతో మాట్లాడి.. ప్రేమ్ సాగర్ మృతదేహం స్వదేశానికి త్వరగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు బండి సంజయ్.