Jhansi Reddy Protest: పాలకుర్తి నియోజక వర్గంలో.. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి పరాభావం ఎదురైంది. ఆమె స్వగ్రామం తొర్రూర్ మండలం చెర్లపాలెంలో.. కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాఘవరావు ఏర్పాటు చేసిన.. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో.. స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఎన్నికల సమయంలో మా ఊరికి రోడ్డు వేస్తానని చెప్పి గెలిచారు. తర్వాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అభివృద్ధి సంగతి పక్కనబెడితే, సమస్యలు అడిగిన వారిని పట్టించుకోలేదు అంటూ మండిపడ్డారు.
అసంతృప్తితో మండిపడిన ప్రజలు.. సభకు వేసిన టెంట్లను పీకి, అక్కడ ఉన్న నాయకులను తరిమి కొట్టేంతవరకు పరిస్థితి దారుణంగా వెళ్లింది. ఈ ఘటనతో సభ రసాభాసగా మారింది. ముఖ్యంగా ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలోనే ఇలాంటి అవమాన పరిస్థితి తలెత్తడం.. రాజకీయంగా ప్రతిష్ఠాపరంగా భావించవచ్చు.
ఒక్క ఊరిని ఏకతాటిపైకి తీసుకురాలేని నాయకత్వం?
ఝాన్సీ రెడ్డి తీరుపై గ్రామస్తులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆమె నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తన స్వగ్రామంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకురాలేని నాయకురాలు.. నియోజకవర్గంలో పార్టీని ఎలా బలోపేతం చేస్తారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే సమయంలో పార్టీ అంతర్గతంగా వర్గ పోరు కూడా.. ఈ పరిణామానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. గత కొన్ని నెలలుగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో.. ఒకే నేత చుట్టూ కార్యకర్తలు కూడకపోవడం, అభిప్రాయ భేదాలు పెరగడం వల్ల ..నెమ్మదిగా విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నాయి.
పార్టీకి ఇమేజ్ సమస్య
ఝాన్సీ రెడ్డి తీరుపై వచ్చిన విమర్శలు, ఆమెకిచెర్లపాలెంలో ఎదురైన వ్యతిరేకత, పార్టీ సమావేశంలో జరిగిన ఘటన ఇవ్వన్నీ.. పార్టీ ప్రతిష్ఠకూ గండిపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారానికి చేరువలో ఉన్న తరుణంలో, ఇటువంటి సంఘటనలు పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించవచ్చు.
పరిష్కారం ఏంటి?
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, ఝాన్సీ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామస్థులను కలిసి సమస్యలు అర్థం చేసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలపై హామీ ఇవ్వడం, గత తప్పులను గుర్తించి పరిష్కరించేందుకు ముందడుగు వేయడం వంటి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాక, పార్టీ కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు.. ఓ సమగ్ర సమీక్ష జరపాల్సిన సమయం ఇది.
Also Read: వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శిస్తే కోరికలన్నీ నెరవేరుతాయ్!
ఝాన్సీ రెడ్డికి ఎదురైన ఈ పరిణామం.. ఆమె రాజకీయ జీవితంలో కీలక మలుపు కావొచ్చు. ఒక్క తప్పు పార్టీ మద్దతును కోల్పోయేలా చేస్తే, ఒక్క చర్య వర్గాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను నివారించగలదు. ఇప్పుడు తాను నాయకురాలిగా నిజంగా ఎంతదూరం వెళ్లగలదో చూపించాల్సిన.. కీలక పరీక్షా సమయం ఇదే.