PC Ghosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతున్నారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావ్. ఈ అంశంపై ఇరువురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ ని నియమిస్తూ 2024 మార్చి 14న, జీవో నెంబర్ 6ను జారీ చేసింది ప్రభుత్వం. తమ పిటిషన్లో కేసీఆర్, హరీష్ ఈ విషయాన్ని కూడా సవాలు చేశారు.
ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో పిటిషన్లు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌ని సైతం తమ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో కమిషన్ నియామకం జరిగిందని.. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించినట్టు తమ పిటిషన్లో వివరించారు కేసీఆర్, హరీష్.
కాళేశ్వరం నిర్మాణం నిబంధనల ప్రకారమే-కేసీఆర్, హరీష్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిబంధనల ప్రకారమే జరిగిందంటారు కేసీఆర్, హరీష్. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏదో ఒక సాకుతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో కూడా విమర్శలు గుప్పించారని వివరించారు. దురదృష్టవశాత్తూ మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిన మాట వాస్తవమేగానీ, ఇందుకు డిజైనింగ్, ఇంజినీరింగ్ తో ఎలాంటి సంబంధం లేదంటారీ ఇరువురు బీఆర్ఎస్ అగ్ర నేతలు.
మంచి పేరు దెబ్బ తీయాలనే లక్ష్యంతోనే..
గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన మంచి పేరు దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అది కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టానికే విరుద్ధమంటోందీ పార్టీ. అలా నియమించే పరిధి ప్రభుత్వానికి లేదని.. ఈ చట్టం కింద ఏర్పాటైన కమిషన్లకు న్యాయ విచారణ నిర్వహించే పరిధి లేదని, అవి కేవలం వాస్తవాలను మాత్రమే వెల్లడించాలని తమ పిటిషన్ ద్వారా తెలియ చేశారు కేసీఆర్, హరీష్.
నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు
కమిషన్ కేవలం తమ పరువు ప్రతిష్టలను ప్రభావితం చేసేలా నివేదిక రూపొందించిందని.. సాక్షిగా తమకు సమన్లు జారీ చేయడం ద్వారా ఘోష్ కమిషన్ మమ్మల్ని తపపుదోవ పట్టించిందని అంటారు కేసీఆర్, హరీష్. నివేదిక ఒక వ్యక్తి ప్రతిష్టపై దుష్ప్రభావం చూపుతుందన్నపుడు నోటీసు జారీ చేయడంతో పాటు.. ఆ వ్యక్తి సాక్ష్యులను ప్రశ్నించే అవకాశం కల్పించాలి. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా రిపోర్ట్ సబ్మిట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అంటారు పిటిషన్ దారులు.
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుల పిటిషన్లు
జస్టిస్ ఘోష్ కమిషన్ గత నెల 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పూర్తి పక్షపాతంతో, ముందస్తు నిర్ణయాలతో, మా పరువుకు నష్టం కలిగించేలా ఉంది. సీఎం, ఇరిగేషన్ మంత్రి ఈ నెల 4న నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ని బట్టీ చూస్తే ఇలా చెప్పవలసి వచ్చింది. నివేదిక కాపీని తమకు ఇవ్వకుండా ప్రభుత్వం మీడియా ప్రచరుణకు ఇవ్వడం పూర్తి దురుద్దేశపూరితం. సాధారణ ప్రజల దృష్టిలో తమను అప్రదిష్టపాలు చేయడమేనంటారు వీరు. అందుకే ఘోష్ కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలంటూ తమ పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్.
Also Read: అప్గానిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం.. 71 మంది మృతి..
అయితే ఇదే అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మ్యణ్ స్పందించారు. కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాక.. ఈ రోజు హైకోర్టుకు వెళ్లడమేంటని నిలదీశారు మంత్రి అడ్లూరి. విచారణకు రాక ముందు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన దొంగతనం బయట పడుతుందనే భయంతో హైకోర్టును ఆశ్రయించారని అన్నారాయన. ప్రాజెక్టు పేరుతో కమిషన్లు దండుకుని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటూ మండి పడ్డారు మంత్రి అడ్లూరి.