BRSV Prashant Arrested: అతనొక బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు. అదే ఆసరాగా చేసుకొని ఓ కళాశాలకు వెళ్ళాడు. ఏంటి మాకేంటి అంటూ బెదిరింపులకు దిగాడట. లేకుంటే మీ పరిస్థితి ఇక అంతే అంటూ.. దౌర్జన్యానికి దిగాడు. ఆ కళాశాల యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎంటర్ అయ్యారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించి, అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచారు. ఆ బెదిరింపులకు పాల్పడిన నాయకుడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం స్టేట్ సెక్రెటరీ ప్రశాంత్.
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం స్టేట్ సెక్రెటరీ ప్రశాంత్ ఒక ముఠాగా ఏర్పడి కళాశాలలను బెదిరిస్తున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ లు ఇవ్వడంతో పాటు రూ. 10 లక్షలు డబ్బులు ఇవ్వాలని ప్రశాంత్, పలువురితో కలిసి కళాశాలల వద్దకు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఆగడాలు భరించలేక పలువురు, పోలీసులను ఆశ్రయించారు. అందులో సీఎంఆర్ కాలేజ్ యజమాని ఒకరు.
సీఎంఆర్ కాలేజ్ వద్దకు వెళ్లిన ప్రశాంత్ 10 లక్షలు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిల్ చేసినట్లు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కాలేజ్ యజమాని ఇంటి దగ్గరకి పదిమందితో కలిసి వెళ్లిన ప్రశాంత్ అండ్ గ్యాంగ్ ఫోటోలు దిగి బెదిరించారట. దీనితో చేసేదేమిలేక ఆ కళాశాల యజమాని, పోలీసులను ఆశ్రయించారు. రోజురోజుకు ప్రశాంత్ గ్యాంగ్ బెదిరింపులు శృతి మించుతుండగా వాటిని భరించలేక ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.
Also Read: Be Alert: ట్రింగ్.. ట్రింగ్.. హలో.. ఒకటి నొక్కండి చాలు.. అధోగతే!
ఈ ఫిర్యాదుతో ప్రశాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, గురువారం ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. అలాగే రాజేంద్రనగర్ కోర్టులో సైతం హాజరుపరిచారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా.. లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాడకుండా, దందాలకు, బెదిరింపులకు పాల్పడడం ఏమిటని కళాశాల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.