Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా? మీలాంటి వారి కోసమే సీఎం రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కేవలం అర్హత ప్రామాణికంగా ఇప్పటికే లబ్దిదారులను గుర్తించిన ప్రభుత్వం, ఇక ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ప్రారంభించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 2004 నుండి 2014 వరకు ఇందిరమ్మ పథకంలో భాగంగా 25 లక్షలకు పైగా గృహాల నిర్మాణం జరిగింది. మరలా 2014 నుండి 2014 వరకు బీఆర్ఎస్ పాలనలో కేవలం 65 వేల గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు అధికారిక లెక్క. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమ 5 ఏళ్ల కాలవ్యవధిలో ఏకంగా 25 లక్షల గృహాలు మంజూరు చేయాలని సంకల్పించింది. మీరు ఈ పథకానికి అర్హత సాధిస్తే చాలు, ప్రభుత్వం తరపున మీకు రూ. 5 లక్షల సాయం అందుతుంది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఈ యూనిట్ కాస్ట్ తో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకొనే వీలున్నట్లు చెప్పవచ్చు.
అయితే ఈ పథకం వర్తింపజేసేందుకు ఇప్పటికే లబ్దిదారులను అధికారులు గుర్తించారు. ఎందరో దరఖాస్తులను అందజేయగా, వాటిలో అర్హులను గుర్తించారు. మొదట ప్రాధాన్యతగా ఎస్సీ, ఎస్టీలకు అధికంగా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ప్రతి నియోజకవర్గంలో 3500 గృహాలను ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని 15 నెలలు పూర్తయిందని, ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి అస్తవ్యస్ధంగా తయారైందని విమర్శించారు. అయినా కూడా తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం పథకం కాస్త ఆలస్యం అవుతుందన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని, వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందని తెలిపారు. ఇచ్చిన ప్రతి మాటను.. హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి తేల్చి చెప్పారు.
Also Read: Womens Railway Stations: తెలుగు రాష్ట్రాలలో మహిళలు నడుపుతున్న.. ఈ రైల్వేస్టేషన్స్ గురించి తెలుసా?
మొత్తం మీద ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుందని, తులం బంగారం కాస్త ఆలస్యమవుతుందని, కానీ తప్పక అమలు చేస్తామని మంత్రి చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులపై దృష్టి సారించిన ప్రభుత్వం, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని మహిళా సంక్షేమానికి సంబంధించి కీలక ప్రసంగం చేయనున్నారు.