Govt Land Encroachment: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్టేషన్ ఎదుటే భూకబ్జా గురైనట్లు అధికారులు గుర్తించారు. 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కూల్చివేసిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు పొన్నం ప్రభాకర్.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఏరియాలో ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ,ఆర్డీవో, ఎమ్మార్వో ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు మంత్రి పొన్నం. ధరణి తరువాత భూ భారతి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం.
ఈ ప్రభుత్వ స్థలం ఏకంగా 200 కోట్ల విలువ ఉంటుంది. ఈ భూమిలో నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై ప్రైవేటు సెక్యూరిటీని పెట్టించి దౌర్జన్యం చేశారు కొందరు బడాబాబులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని 33 ప్లాట్స్ వెనకాల ఉన్న రెవెన్యూ స్థలం ఆక్రమణలకు గురైంది. దీన్ని గుర్తించిన రెవెన్యూ సిబ్బంది వేసిన కంచెను.. కొందరు బౌన్సర్లను పెట్టి తీయించారు. మరోసారి ఫెన్సింగ్ వేసేందుకు వచ్చిన సిబ్బందిపై దాడికి యత్నించారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ భూమి తిరిగి ప్రభుత్వం చేతికి వచ్చింది.
Also Read: రిమాండ్ పొడిగింపు.. మళ్లీ చంచల్ గూడ జెలుకు అఘోరీ
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో పర్యటించారు GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన రెండోదశ శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. అలాగే.. ఖాజాగూడ చౌరస్తా దగ్గర చేపట్టనున్న ఫ్లైఓవర్ అండర్‌పాస్‌కు స్థల పరిశీలన కూడా చేశారు. మల్కంచెరువులో శానిటేషన్, కుక్కల బెడదపై వాకర్స్ ఫిర్యాదు చేయడంతో.. వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిల్పా లేఔట్‌లో రెండో ఫేస్ ఫ్లైఓవర్ పనులను కూడా పరిశీలించారు కమిషనర్. ఫ్లైఓవర్ పనులను ఈనెల చివరికి పూర్తిచేయాలని ఆదేశించారు కమిషనర్. భూసేకరణ పూర్తిచేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. భూసేకరణ పక్రియను త్వరగా పూర్తిచేయాలని జోనల్ కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.