HYDRAA Expansion: స్వేచ్ఛ బ్యూరో: గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి వరదలు లేని నగరమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు మద్ధతు పలికారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి చెరువులు, వరద కాలువలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలకు చెందిన వివిధ వృత్తి నిపుణులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను సోమవారం కలిసి హైడ్రా కార్యకలాపాలకు మద్ధతు పలికారు.
చెరువుల పునరుద్ధరణ అద్భుతం..
పలువురు న్యాయవాదులు, పర్యావరణవేత్తలు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఇలా వివిధ వృత్తుల్లో సేవలందిస్తున్నవారు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువులను చూస్తే ఎంతో ముచ్చటేస్తోందన్నారు. నగరంలో చెరువులన్నీ ఇదే మాదిరి ఇన్ లెట్లు, ఔట్‌లెట్లతో అభివృద్ధి జరిగితే చాలా వరకు వరదలను నియంత్రించ వచ్చునన్నారు. చెరువుల చెంత హైడ్రా అభివృద్ధి చేస్తున్న గ్రీనరీ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆ దిశగా హైడ్రా చర్యలు..
మూడు మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడికతో భూమిలోకి నీరు ఇంకని పరిస్థితి గతంలో ఉండేదని, ఇప్పుడు పూడికను పూర్తిగా తొలగించి చెరువులను అభివృద్ధి చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన కొద్డిపాటి వర్షాలకే చెరువుల్లో నీరు చేరి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయన్నారు. జలవనరులను కాపాడితే ప్రకృతి పరిరక్షణకు వెసులుబాటుంటుందని, ఆ దిశగా హైడ్రా చర్యలు అభినందనీయమన్నారు.
కబ్జాల నిరోధమే లక్ష్యం..
పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలు కాకుండా చూడడం సామాన్యమైన విషయం కాదని పలువురు పేర్కొన్నారు. హైడ్రా పట్ల నగర ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడిందని, ఇదే విధంగా పని చేసి చక్కటి వాతావరణం ఉండేలా చూడాలని వారు కమిషనర్ రంగనాధ్ ను కోరారు. హైడ్రాను రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ రంగనాధ్ ను కలిసిన వృత్తి నిపుణులు.
Also Read: ఆదిలాబాద్ టు అసెంబ్లీ.. రైతు సమస్యలపై బీజేపీ సమరభేరి!