Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఇండీ కూటమి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం పనితీరుపై ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫారమ్‌లు, SIR సవరణలపై అసత్యాలు
ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారమ్-6, తొలగింపులకు వాడే ఫారమ్-7లను చూపిస్తూ కాంగ్రెస్ ప్రజలను భయపెడుతోందని ఆరోపించారు. 2025 జూన్ 24న బిహార్‌లో చేపట్టిన SIR ప్రక్రియ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయంతోనే జరిగిందని, దీనికి సుప్రీంకోర్టు ఆమోదం కూడా ఉందని తెలిపారు. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలోనే 12 సార్లు SIR జరిగిందని, మరి అప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ అక్రమమేనా అని ప్రశ్నించారు.
ఓటర్ల జాబితా శుద్ధీకరణపై ద్వంద్వ వైఖరి
చనిపోయిన 2.8 కోట్ల మంది పేర్లను జాబితా నుంచి తొలగించాలా వద్దా అని నిలదీశారు. 2018లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో లక్షలాది నకిలీ, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ, కమల్‌నాథ్, సచిన్ పైలట్‌లు స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అప్పట్లో నకిలీ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్, ఇప్పుడు ఓటర్ల జాబితా శుద్ధీకరణను ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలన్నారు. 13 కోట్ల ఓట్లు అక్రమంగా తొలగించారంటున్న కేసీ వేణుగోపాల్ అందుకు ఆధారాలు చూపాలని సవాలు విసిరారు.
ఈవీఎంలు, కాంగ్రెస్ నైజం
కాంగ్రెస్ గెలిస్తే వ్యవస్థలు బాగున్నాయని, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం ఆనవాయితీగా మారిందన్నారు. ఈవీఎంలను ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని, మరి ఇప్పుడు రాహుల్ తన తండ్రి నిర్ణయాన్నే తప్పుపడుతున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ కూడా ఓటు చోరీతోనే గెలిచిందా అని ప్రశ్నిస్తూ.. తప్పుడు ఆరోపణలు మానాలని హితవు పలికారు.
Also Read: ఎల్‌నినో దెబ్బకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి స్థానంలో ఇవి వేస్తే కాసుల వర్షమే!