Satyam Srirangam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యాదాన్ మహ్మద్ అవార్డు లభించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య విలువలపై, రాజ్యాంగ పరిరక్షణపై అపారమైన నమ్మకం ఉందన్నారు. ఆయన ప్రజాహితమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ, సరికొత్త పరిపాలనా సంస్కరణలతో నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈసీ నిర్ణయాలు, SIR అమలుపై తీవ్ర విమర్శలు
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను నీరుగార్చేలా కేంద్రం తీరు ఉందన్నారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని సత్యం శ్రీరంగం ఆరోపించారు. కావలనే ప్రతిపక్ష నేతల, ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించి భాజపాకు అనుకూలంగా వాతావరణం సృష్టించారని మండిపడ్డారు.
జ్ఞానేశ్వర్ కుమార్ పై విచారణకు డిమాండ్
ఎన్నికల కమిషన్ అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఆయన గనుక ఆ తరహా అక్రమాలకు పాల్పడకపోతే గడిచిన ఎన్నికల్లో బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా వచ్చేవి కావని సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేశ్వర్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలని, ఆయనను విధుల్లోంచి తొలగించి చట్టరీత్యా ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
జ్ఞానేశ్వర్ కుమార్ అక్రమాలను, ఎన్నికల కమిషన్ దుర్వినియోగాన్ని నిరసిస్తూ రేపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరి మెడలు వంచి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ చేస్తున్న దేశవ్యాప్త పోరాటానికి యువత, ప్రజలందరూ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: మేo ఉనట్టా? లేనట్లా?.. సర్కార్ సస్పెన్స్‌తో మాజీ చైర్మన్ల మైండ్ బ్లాక్!