Success Story| ఒకప్పుడు ఇంట్లో విద్యుత్ కూడా లేని పరిస్థితిలో కిరోసిన్ దీపం వెలుగులో చదివిన బాలుడు నేడు ఐపిఎస్ అధికారిగా ఎదిగాడు. రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించిన తల్లిదండ్రుల కుమారుడు తన లక్ష్యాన్ని సాధించాడు. కష్టపడి భారీ జీతంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఆ ఉద్యోగాన్ని వదిలి యుసిఎస్‌సి పరీక్షలకు సిద్ధమయ్యాడు. పట్టుదలతో అనేక పోటీ పరీక్షల్లో విజయం సాధించి పోలీస్ సర్వీసులో అడుగుపెట్టాడు.
శరణ్ గోపీనాథ్ కాంబ్లే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న తడ్వాలే గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వ్యవసాయ కూలీ పనిచేయడం, కూరగాయలు విక్రయించడం చేస్తూ కుటుంబ అవసరాలను తీర్చేవాడు. ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ, కుమారుడి భవిష్యత్తు కోసం మంచి విద్య అందించాలని మాత్రం కోరుకున్నాడు.
శరణ్ తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్మీడియంట్ చదువు కోసం ఆయన ప్రతిరోజూ దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. గ్రామంలో కరెంట్ లేకపోవడం ఆయన స్కూల్ చదువు అంతా ఇంట్లో రాత్రివేళల్లో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవాడు.
తర్వాత శరణ్ సంగ్లీలోని వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివాడు. మహారాష్ట్ర CET పరీక్షలో విజయం సాధించి ఈ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఆ తర్వాత బెంగళూరులోని IISc నుంచి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు.
చదువు పూర్తయ్యాక ఆయనకు ప్రైవేట్ కంపెనీలో సుమారు రూ.20 లక్షల వార్షిక జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే, శరణ్ ఆ ఉద్యోగాన్ని ఎంచుకోకుండా ప్రజాసేవలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
UPSC పరీక్షలకు సిద్ధమయ్యేందుకు శరణ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నెలకు రూ.12,000 స్కాలర్‌షిప్ కూడా లభించింది. ఈ స్కాలర్‌షిప్ 8 నెలల పాటు ఆయనకు ఆర్థికంగా సహాయపడింది. ఈ కష్టమే ఆయనకు అనేక విజయాలు తీసుకొచ్చింది.
2019లో UPSC CAPF పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 8 సాధించాడు. 2020లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 542వ ర్యాంక్ సాధించాడు. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలో 127వ ర్యాంక్ సాధించాడు.
శరణ్ 2021 బ్యాచ్ IPS అధికారిగా రాజస్థాన్ క్యాడర్‌కు ఎంపికయ్యాడు. తర్వాత జాలోర్ జిల్లాలోని సాంచోర్ ప్రాంతంలో ACPగా పనిచేశాడు. అక్కడ ఆయన డ్రగ్స్ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై చర్యలు తీసుకున్నాడు.
Also Read: నెలకు రూ.1 లక్ష సాలరీ.. సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని చిన్న బిజినెస్.. నేడు రూ.9 కోట్ల టర్నోవర్
కిరోసిన్ దీపం కింద చదివిన శరణ్ ప్రయాణం పట్టుదలకు చక్కని ఉదాహరణగా నిలిచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యపై నమ్మకం ఆయన విజయానికి ముఖ్యమైన ఆధారాలుగా నిలిచాయి. కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగితే అవకాశాలను అందుకోవచ్చని ఆయన ప్రయాణం చూపిస్తుంది.
Also Read: రూ.50 లక్షల పెట్టుబడితో రూ.50 కోట్ల రాబడి.. 21 ఏళ్ల యువతి జాక్‌పాట్