Runa Mafi: తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం, చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీపై రూ. 33 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
5,691 మంది కార్మికులకు ప్రత్యక్ష లబ్ధి:
ఈ స్కీమ్ ద్వారా మొత్తం 5,691 మంది చేనేత కార్మికులు లబ్దిపొందనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక భారం తగ్గించడమే కాక, తిరిగి ఉత్పత్తి పై దృష్టి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది.
2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత ఉత్పత్తి, వృత్తి సంబంధిత కార్యక్రమాల కోసం తీసుకున్న రుణాలకు మాత్రమే.. ఈ మాఫీ వర్తిస్తుందని మంత్రి వివరించారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు వర్తించనుంది.
గైడ్‌లైన్స్ ప్రకారం స్పష్టత:
ఈ రుణ మాఫీ విధానానికి సంబంధించి.. ప్రభుత్వం ముందే స్పష్టమైన గైడ్‌లైన్స్ విడుదల చేసింది. దానిలో పేర్కొన్న విధంగా:
రుణం లక్ష రూపాయల లోపు ఉండాలి.
చేనేత వృత్తికి అనుగుణంగా తీసుకున్న రుణమే అయి ఉండాలి.
గడిచిన ఏడు సంవత్సరాలలో.. తీసుకున్న రుణమే అర్హత కలిగి ఉంటుంది.
ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ జరుపుతున్నారు. పూర్తి స్థాయిలో వాస్తవిక వెరిఫికేషన్ జరిగిన తర్వాత, తగిన రుణ మాఫీ మొత్తాన్ని నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
రుణ మాఫీ తర్వాత మళ్లీ రుణం కూడా మంజూరు:
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, అవసరమైన వారు తిరిగి అదే బ్యాంకుల ద్వారా.. కొత్తగా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. మంత్రి తుమ్మల వివరించినట్లు, బ్యాంకర్లు మళ్లీ రుణాలను మంజూరు చేయడానికి ముందుంటారని, ఇదొక పునరుద్ధరణకు నాంది అని చెప్పారు.
చేనేత రంగానికి 920 కోట్ల ఖర్చు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. సుమారు ₹920 కోట్లను చేనేత రంగ అభివృద్ధికి వెచ్చించామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇందులో ఇందిరా మహిళాశక్తి చీరల పథకం, చేనేత అభయహస్తం, నేతన్నకు చేయూత లాంటి పథకాలద్వారా చేనేతకు ఊతమిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
ఇందిరా మహిళాశక్తి చీరల పథకం:
ఈ పథకం ద్వారా సిరిసిల్లలోని 16,000 మరమగ్గాలకు.. నిరంతర ఉత్పత్తి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
మహిళలకు ఉచితంగా అందించే చీరల ద్వారా.. కార్మికులకు స్థిర ఆదాయం కల్పించామని పేర్కొన్నారు.
చేనేత అభయహస్తం & నేతన్నకు చేయూత పథకాలు:
చేనేత అభయహస్తం పథకం ద్వారా ఇప్పటికే.. 193 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు.
Also Read: మేడారం సమ్మక్క సారలమ్మ.. మహా జాతర డేట్ ఫిక్స్..
గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా వదిలేసిన 290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాలలో జమ చేశామన్నారు.