Sangareddy: నాన్న అనే పదానికి కళంకం తెచ్చిన ఘటన ఇది. కంటికి రెప్పలా తన కుమార్తెను కాపాడుకోవాల్సిన నాన్న, యముడి అవతారమెత్తాడు. తన బిడ్డను తనే చంపాడు. నాన్న అంటే భరోసా, భాద్యత అన్నది మరిచాడు. ఏకంగా బావిలోకి నెట్టి కుమార్తెను చావుకు కారణమయ్యాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సంగాపూర్ లో జరిగింది.
పోలీసుల వివరాల మేరకు.. సంగాపూర్ కు చెందిన సతీష్ కు వివాహమై ఇద్దరు సంతానం. ఈ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. కాలం గడిచింది. సతీష్ వేధింపులకు పాల్పడడం మొదలు పెట్టాడు. తన భర్త వేధింపులు రోజురోజుకు అధికం కావడంతో, నెలన్నర క్రితం బిడ్డలను వదిలి సతీష్ భార్య పుట్టింటికి వెళ్లింది. దీనితో సతీష్ లో ఉన్మాది బయటకు వచ్చాడు. భార్య దూరం కావడంతో తన పిల్లలను బాధ పెట్టేవాడు.
ఈదశలో సతీష్ చిన్న కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇంతలోనే సతీష్ మరో కుమార్తె వైష్ణవి (11) ఒక్కటే తన తండ్రి వద్ద ఉండేది. వైష్ణవి కూడ ఈనెల 16న బావిలో శవమై కనిపించింది. నాయనమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతలోనే అస్సలు విషయం తెలిసింది. ఈ హత్యకు పాల్పడింది సతీష్ అంటూ తేలింది.
Also Read: Venu Swamy: ఎట్టకేలకు కమిషన్ ముందుకు వేణు స్వామి.. నెక్స్ట్ ఇలా చేస్తే?
అసలేం జరిగిందంటే..
ఈనెల 16న వైష్ణవి వద్దకు తండ్రి సతీష్ వచ్చాడు. ఇటు రమ్మని పిలిచాడు. నాన్న కదా.. అంటూ ఆ బాలిక ఉరుకులు పరుగులతో వచ్చింది. నాన్నలో ఉన్మాదిని గ్రహించలేని వైష్ణవి రావడంతోటే, స్థానిక బావి వద్దకు ఆమెను సతీష్ తెసుకెళ్లాడు. అలా తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో బావిలోకి నెట్టివేశాడు. బావిలో ఊపిరి ఆడని స్థితిలో వైష్ణవి ప్రాణాలు వదిలింది. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ హనుమంతు విచారణతో హత్య ఘటన వెలుగులోకి రాగా, పోలీసులు సతీష్ ను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, సతీష్ కు రిమాండ్ విధించారు. నాన్న అనే పదానికి కళంకం తెచ్చేలా జరిగిన ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.