Principal Rude Behavior: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్ద అంబర్ పేట్ కండోర్ షైన్ స్కూల్ ప్రిన్సిపాల్ దాష్టీకం వెలుగు చూసింది. విద్యార్థులు బొట్టుపెట్టుకొని స్కూల్ కి వచ్చారని ప్రిన్సిపల్ చితకబాదినట్లు తెలిసింది. అంతేగాకుండా బలవంతంగా వాష్ రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించినట్లు.. అలాగే స్టూడెంట్స్ ను నానా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
ప్రిన్సిపల్ చేసిన దాష్టీకంపై ఓ స్టూడెంట్ తన బాధను వ్యక్తం చేశాడు. ‘ఇవాళ మార్నింగ్ నుదుట బొట్టు పెట్టుపెట్టుకుని స్కూల్‌కు వెళ్లాను. ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి అందరి దగ్గరకు వచ్చి యూనిఫామ్స్ చెక్ చేశారు. నేను లాస్ట్ లో నిలుచున్నాను. నా దగ్గరకు వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావని అడిగారు. ఏంటి సర్, నాకు అర్ధం కాలేదని చెప్పగానే మెడపై గట్టిగా కొట్టారు. వెంటనే వెళ్లి బొట్టు తీసేయ్ అంటూ వాష్‌రూమ్ వరకు గుంజుకెళ్లారు. క్లాస్‌లో కూడా బొట్టు పెట్టుకుని ఎవరు కనిపించినా బొట్టు తీసేయాలని.. ఎందుకు పెట్టుకున్నావని ప్రిన్సిపల్ అడుగుతారు. రోజు స్కూల్ కి ఎవరూ బొట్టు పెట్టుకుని రావొద్దని చెబుతారు’ అని బాధిత విద్యార్థి వాపోయాడు.
విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ దాష్టీకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రిన్సిపాల్ తరుచూ పిల్లలను వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. పిల్లలను చితక బాదడం ఇది ఫస్ట్ టైం కాదని.. ఇంతకుముందు కూడా నాలుగైదు సార్లు ఇలా దాడి చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.
ALSO READ: Intermediate Exam Tips: పరీక్షల్లో మంచి మార్కుల కోసం ఇవి పాటించండి.. సక్సెస్ మీదే..
ఇలా చేయడం ఏంటని.. ప్రశ్నించేందుకు వస్తే స్కూల్ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని వారు ఫైరయ్యారు. స్టూడెంట్స్ పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళనతో స్కూల్ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. ప్రిన్సిపాల్ ప్రవర్తన గతంలో తమ దృష్టికి రాలేదని.. మేం వెంటనే ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. తమ పాఠశాలలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగమని చెప్పింది. ఇలా ఘటనలను ప్రోత్సహించమని స్పష్టం చేసింది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని విచారిస్తున్నారు.
అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ లో పిల్లల పట్ల ప్రిన్సిపాల్ ప్రవర్తించిన తీరు ఏమాత్రం సరికాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.