Big Stories

Congress: కాంగ్రెస్ మారదా? సీఎంను తేల్చదా? బీజేపీని చూసి నేర్వదా?

- Advertisement -

Congress: ఇప్పటి వారికి తెలీకపోవచ్చు కానీ, కాంగ్రెస్ అంటేనే ఢిల్లీ పాలన. విషయం చిన్నదైనా, పెద్దదైనా.. నిర్ణయం 10 జన్‌పథ్ నుంచి రావాల్సిందే. 80ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకేటర్మ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చేసిన చరిత్ర ఆ పార్టీది. అంతెందుకు, వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్యను ఆ తర్వాత కిరణ్‌కుమార్‌‌రెడ్డిని సీఎంలను చేయలే. అంతా సీల్డ్ కవర్ సీఎంలే. ఎమ్మెల్యేల అభిప్రాయం అని పైకి చెబుతారే కానీ.. డెసిషన్ మాత్రం అధిష్టానందే. ఢిల్లీలో బాగా లాబీయింగ్ చేసుకున్నవాళ్లకే ముఖ్యమైన పదవులు. అట్లుంటది కాంగ్రెస్‌తోని.

- Advertisement -

అదంతా గతం. ఇప్పుడు రాహుల్‌గాంధీ జమానా. పార్టీ పరిస్థితి మారిందనుకున్నారంతా. కానీ, తామేమీ మారలేదని, వందేళ్ల ముతక వాసన ఇంకా పోలేదని కర్నాటక ఎపిసోడ్‌తో మరోసారి రుజువు అవుతోంది. ఇప్పటికీ సీల్డ్ కవర్‌లోనే సీఎం ఎంపిక జరుగుతోంది. కౌన్ బనేగా కర్నాటక సీఎం? సిద్ధరామయ్యా? శివకుమారా? తేల్చే పనిలో ఉంది అధిష్టానం. రోజుల తరబడి మంతనాలు జరుపుతోంది. ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. కాంగ్రెస్ తీరుపై కార్యకర్తలు, ప్రజల్లో విసుగు పుడుతోంది. సీఎం ఎంపిక తలనొప్పితో.. కాంగ్రెస్‌కు గెలిచిన ఆనందం కూడా లేకుండో పోతోంది.

136 మంది ఎమ్మెల్యేలతో సింగిల్‌గానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. గెలిస్తే ఎవరు సీఎం అనేది ముందే నిర్ణయించుకోవాల్సింది. కానీ, గెలుపుపై నమ్మకం లేకనో, నాయకత్వ లోపమో కానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక తేనెతుట్టెను కదిలించింది. సిద్ధరామయ్య తనకిదే లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. శివకుమారుడేమో ఫస్ట్ ఛాన్స్ ప్లీజ్ అని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేయడం.. ఆ పార్టీకి తలకు మించిన భారంగా మారింది. ఆలస్యం అవుతున్నకొద్ది.. పరిస్థితి చేజారిపోతోంది. ఒక్కరోజులో తేల్చేసే దానికి ఇంత హైడ్రామా దేనికోసం? ఇప్పటికే డీకే బాగా హర్ట్ అయ్యారు. బ్లాక్ మెయిల్ చేయనంటూనే చేస్తున్నారు.

రాజస్థాన్‌లోనూ ఇలానే చేశారు. ఎడారి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరాక.. ముఖ్యమంత్రి పీఠం కోసం కురవృద్ధుడు అశోక్ గెహ్లాట్, యంగ్ లీడర్ సచిన్ పైలట్ మధ్య పోటీ ఎదురైంది. అప్పుడూ అలానే బాగా సా..గ..దీ..సి సీనియార్టీకే పట్టం కట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. సచిన్ పైలట్ స్వపక్షంలోనే విపక్షంగా మారి చేతికి వాతలు పెడుతూనే ఉన్నారు. ఆయన పార్టీని వీడకపోవడం ఒక్కటే రాజస్థాన్ కాంగ్రెస్‌కు ఊరట. సేమ్ సీన్.. కర్నాటకలోనూ రిపీట్ అవుతుందా?

సిద్ధరామయ్యను సీఎం చేస్తే.. డీకే హర్ట్ అవుతారు. శివకుమార్‌ను సీఎం చేస్తే.. సిద్ధు ఇగో దెబ్బతింటుంది. అందుకే ముఖ్యమంత్రి ఎంపిక ఛాలెంజింగ్‌గా మారింది. మనోభావాలు దెబ్బతిన్నా.. సచిన్ పైలట్‌లా పార్టీకే కట్టుబడి ఉంటే ఓకే. లేదంటే..? రెబెల్‌గా మారి పార్టీని చీల్చితే..? మరో మహారాష్ట్ర శివసేన ఉదంతం రిపీట్ అయితే..? ఇదే అంశం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవర పెడుతోంది.

కర్నాటకకే చెందిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపైనా విమర్శలు వస్తున్నాయి. ఖర్గే సమన్వయం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. ముందే ఓ అవగాహనకు రాకుండా.. చేతులు కాలుతుంటే ఇప్పుడు ఆకులు పట్టుకుంటామంటే ఎలా? అంటున్నారు. అంతా ఖర్గే వల్లే అంటున్నారు.

బీజేపీ చేసిన పొరబాటే కాంగ్రెస్ చేస్తోందని తప్పుబడుతున్నారు. రాష్ట్ర నేతలను డమ్మీలను చేసి.. ఢిల్లీ నుంచే అంతా నడిపి.. ఇప్పుడిలా ఘోర పరాజయం పాలైంది కమలదళం. బీజేపీని చూసైనా కాంగ్రెస్ నేర్చుకోదా? ఢిల్లీ పెత్తనం తగ్గించుకోదా? ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి సీఎం ఎంపిక వరకూ.. అంతా ఢిల్లీ చేతుల్లోనే ఉండాలా? గతం నుంచి గుణపాఠాలు నేర్వదా? కాంగ్రెస్ అంటే అంతేనా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News