KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు త్వరలోనే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గలో ఉప ఎన్నిక వస్తుందని.. అక్కడ కడియం శ్రీహరి ఓడిపోయి.. తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఎర్రవల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ ను ఇవాళ తాటికొండ రాజయ్య కలిశారు. కేసీఆర్ సమక్షంలో ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందితో చేరికల కార్యక్రమం చేపట్టనున్నట్లు సమాచారం.
అయితే, ఎలాంటి ఎన్నికలను అయినా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇది బూస్టప్ గా మారుతుందని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఇప్పటికే దూకుడు పెంచాయి. రెండు పార్టీలు ప్రచారానికి సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తూ ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు పక్కా వ్యూహరచనతో ముందుకెళ్తున్నాయి. ఉద్యమ పార్టీగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు సార్లు ఏలిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం చేతులెత్తేయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఎర్రవల్లి ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో ఓ సారి బీఆర్ఎస్ నాయకులు ఆయనను ఫాం హౌస్ లో కలుస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అడపాదడపా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ చేతుల ఎత్తేసింది. పోటీకి దూరంగా ఉండడం పలు చర్చలకు దారి తీస్తుంది. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్న అనుమానాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఓటమి భయం కూడా బీఆర్ఎస్ కు పట్టుకుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ నుంచి వైదొలగడంతో గులాబీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహాలకు గురి చేస్తుంది.
నిజం చెప్పాలంటే.. బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు పోటీ చేయడానికి ముందుకొచ్చారు. ముఖ్య నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ హైకమాండ్ పోటీ నుంచి వైదొలగడంతో నేతలు అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ కేసీఆర్ రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.