Srikakulam: శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు కొట్టిన ఆకులను తిని 35 మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడంతో ఒక పేద రైతు కుటుంబం వీధిపాలైంది.
తోటలో మేత తిని దుర్మరణం
పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల యజమాని లక్ష్మీనారాయణ తన జీవనాధారమైన 350 గొర్రెలు, మేకలను మేత కోసం హిరమండలంలోని వంశధార రిజర్వాయర్ ఎగువ ప్రాంతానికి తోలుకెళ్లాడు. అక్కడ ఉన్న ఒక సరుగుడు తోటలోకి మేత కోసం వెళ్లిన జీవాలు, తోట యజమాని ఇటీవల కొట్టిన పురుగుల మందు ప్రభావం ఉన్న ఆకులను తిన్నాయి. క్రిమిసంహారక మందు ఘాటుకు క్షణాల్లోనే 35 గొర్రెలు, మేకలు అక్కడికక్కడే విగతజీవులుగా పడిపోయాయి.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
కళ్లముందే తమ జీవాలు ఒక్కొక్కటిగా విలవిలలాడుతూ ప్రాణాలు వదలడం చూసి యజమాని లక్ష్మీనారాయణ గుండెలు పగిలేలా ఏడ్చాడు. సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని, చెల్లాచెదురుగా పడి ఉన్న గొర్రెల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఏడాదంతా కష్టపడి పెంచుకున్న జీవాలు ఒక్కసారే చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
రూ. 7 లక్షల ఆస్తి నష్టం
ఈ ఘోర ప్రమాదంలో సుమారు 7 లక్షల రూపాయల వరకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి ఏకైక జీవనాధారమైన గొర్రెలు చనిపోవడంతో ప్రభుత్వం స్పందించి, పరిహారం అందించి తమను ఆదుకోవాలని ఆ రైతు కుటుంబం కన్నీళ్లతో వేడుకుంటోంది.
Also Read: మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని ముగ్గురు యువతులు మృతి!