
YS Sharmila and Jagan with Congress(Political news telugu):
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందుకు షర్మిల సైతం మినహాయింపు కాదు. వైఎస్సార్‌టీపీ అంటూ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి.. కేసీఆర్‌పై లొల్లి లొల్లి చేసి.. చివరాఖరికి సముద్రంలాంటి కాంగ్రెస్‌లో కలిసిపోతున్నారు. నేరుగా సోనియా, రాహుల్‌లతోనే భేటీ అయ్యారు. అంతా ఓకే అయినట్టే అంటున్నారు. మంచి ముహూర్తం చూసి పార్టీ విలీనం ఉంటుందని చెబుతున్నారు.
మొదట్లో అంతన్నారు, ఇంతన్నారు. తాను ఎవరో వదిలిన బాణం కాదన్నారు షర్మిల. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం అని చెప్పారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో.. చేతిలో చెయ్యేయటానికి రెడీ అయ్యారు. ఎంత తేడా.. వైఎస్సార్ రక్తమే అయినా.. అన్నకు, చెల్లికి మధ్య ఎంత తేడా? ఆనాడు తండ్రి మరణం తర్వాత తానే సీఎం అని పట్టుబట్టారు జగన్. కాంగ్రెస్ కుదరదు పొమ్మంది. ఆయన పార్టీ వీడి వెళ్లిపోయారు. సొంత పార్టీ పెట్టుకుని.. సొంతంగా సీఎం అయ్యారు. అప్పటి యూపీయే ప్రభుత్వం కేసులు పెట్టి, జైల్లో పెట్టినా అదరలేదు, బెదరలేదు, మడమ తిప్పలేదు.
షర్మిల విషయంలో మరోలా జరిగింది. జగన్ స్టైల్‌కు కంప్లీట్ రివర్స్. అన్నతో గొడవపడి అత్తారింటికి వచ్చేశారు. తెలంగాణ కోడలినంటూ కొత్త పార్టీ పెట్టుకున్నారు. ప్రైవేట్ ఈవెంట్‌లా పార్టీని నడిపించారు. తన వెనుక నేతలు, కార్యకర్తలు లేకున్నా.. సింగిల్‌గా రాజకీయ రచ్చ చేశారు. డైలీ న్యూస్‌లో ఉండేలా చూసుకున్నారు. పార్టీ బలంగా ఉందని చెబుతూ.. ఇప్పుడు సోనియాగాంధీ ముందు బేరం పెట్టారు. జగన్ ఎదిరించి నిలిచిన నేతతోనే.. షర్మిల డీల్ మాట్లాడుకున్నారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంత తేడా? అన్నాచెల్లిల రాజకీయంలో ఎంత తేడా?
తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఇప్పటికీ ఊరూరా ఉన్నారు. ఆమె సామాజిక వర్గం అదనపు బలం. క్రిస్టియన్ ఓట్లకూ గాలం వేయొచ్చు. ఆ మేరకు షర్మిల చేరికతో హస్తం పార్టీకి లాభం జరగొచ్చు. ఇంతవరకైతే ఓకే. కానీ, తాను వైఎస్సార్ కూతురినని.. తనకు కీలక పదవులు, హోదాలు కావాలని పట్టుబడితే మాత్రం.. మిగతా సీనియర్ల నుంచి అంతగా సహకారం రాకపోవచ్చు. మళ్లీ గ్రూపులు గట్రా మొదలుకావొచ్చు. అందుకే, షర్మిల రాకను కొందరే వెల్‌కమ్ చేస్తున్నారు. కానీ, ఢిల్లీలో డీల్ కుదిరిపోయిందని.. రేపోమాపో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం కన్ఫామ్ అని అంటున్నారు. మరి, షర్మిలకు ఏ పదవి కట్టబెడతారనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.
మరోవైపు, షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కట్టబెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే ఫుల్లీ లోడెడ్. ఆమె అవసరం అతితక్కువే. అదే ఏపీలో అలా కాదు. షర్మిల ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. అటు అన్న మీద రివేంజ్ తీర్చుకున్నట్టూ ఉంటుంది.. ఇటు పార్టీ ఆమె చేతిలో ఉంటుంది. అందుకే, ఏపీ కాంగ్రెస్ కోసమే షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోందని అంటున్నారు. డీకే శివకుమార్ సైతం షర్మిలను ఏపీకే పరిమితం కావాలని సూచించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే… అన్న వర్సెస్ చెల్లి.. పొలిటికల్ వార్ మరింత రంజుగా సాగే ఛాన్స్ ఉంది.