E-Paper
Advertisement

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా
Advertisement

Singareni Bonus: స్వేచ్ఛ బ్యూరో: ‎సింగరేణి బొగ్గు గని కార్మికులకు దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్‌ ఉద్యోగులకు లాభాల వాటా కింద ఒక్కొక్కరికి సగటున రూ.1,53,912 చెల్లించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ‎ప్రజాభవన్‌లో మంగళవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటి సీఎం మాట్లాడుతూ.. మొత్తం 38,737 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారని, 29717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున దసరా బోనస్‌ చెల్లించనున్నట్లు తెలిపారు.

సొంతింటి కల సాకారానికి ప్రత్యేక కార్యాచరణ

Advertisement

గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు లాభాల వాటాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ఏడాది సింగ‌రేణి ఆర్జించిన రూ.1754 కోట్ల నిక‌ర లాభాల్లో 34 శాతం అంటే రూ.596 కోట్లను లాభాల వాటాగా కార్మికుల‌కు పంపిణీ చేయ‌నున్నట్లు వివ‌రించారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్‌ అందించామని, ఈ ఏడాది కూడా అదే మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు వివరించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తామని, కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

అధికారులకు ఆదేశాలు..

Advertisement

సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో ఇప్పటి వరకు మైనింగ్‌ చేపట్టని ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువైన లేఅవుట్లు సిద్ధం చేయాలన్నారు. ‎సింగరేణిలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్‌ ఆర్డర్లు, ఇతర చట్టపరమైన ప్రక్రియలను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేయాలని ఆదేశించినట్టు తెలిపారు. కార్మికుల పేర్ల మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 136 నుంచి గరిష్ఠంగా 170 మంది సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించామని, ఇందుకోసం ఏర్పాటు చేసిన సింగరేణి అధికారుల కమిటీ సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్ణీత రోజున మెడికల్‌ బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించామన్నారు.

‎‎సింగరేణి లాభాలు తగ్గడానికి కారణాలివే

‎‎గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సింగరేణి లాభాలు తగ్గడానికి పలు కారణాలున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ముఖ్యంగా గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాక్‌లను అదనంగా సాధించడంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేయడం వల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సుమారు 141 బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోలేదని, దీంతో సంస్థ వ్యాపార విస్తరణకు ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఉన్న బొగ్గు బ్లాక్‌లలో కొన్ని మూతపడుతుండటంతో ఉత్పత్తి, ఆదాయంపై ప్రభావం పడుతోందన్నారు. దాదాపు 14 బ్లాక్‌లు మూతపడిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త బ్లాక్‌లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‎‎సింగరేణి సంస్థను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనపై దృష్టి సారించిందని భట్టి విక్రమార్క తెలిపారు.

భట్టి విక్రమార్క కీలక ప్రకటన

గత ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్త బ్లాక్‌లను సాధించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. తాడిచెర్ల-2, కోయగూడెం బ్లాక్ -3, మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌, నైని వంటి బ్లాక్‌లను ప్రస్తావిస్తూ, కొత్త బ్లాక్‌ల సాధనతో పాటు సంస్థ వ్యాపారాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఏ మైనింగ్‌ సంస్థ అయినా నిరంతరం కొత్త బ్లాక్‌లను సాధిస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటేనే దాని ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తు, సంస్థ మనుగడ, బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెంపు దృష్ట్యా ఈ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.‎ ‎సింగరేణికి విద్యుత్‌ సంస్థల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా భట్టి విక్రమార్క ప్రస్తావించారు. గత పదేళ్లలో సుమారు రూ.29 వేల కోట్ల బకాయిలు పేరుకుపోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో సుమారు రూ.27 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు వివరించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొత్తాలను క్రమంగా చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ బకాయిలను ఒక్కసారిగా చెల్లించడం సాధ్యం కాకపోయినా, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
‎
బీఆర్ఎస్.. ‎సింగరేణిని భ్రష్టు పట్టించింది : మంత్రి శ్రీధర్‌బాబు‎

సింగరేణి సంస్థను పదేళ్ల పాటు అధికారంలో ఉండి నిర్వీర్యం చేసి, భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు పోరుబాట పేరుతో ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి పరిష్కరించలేని సమస్యలను ప్రతిపక్షంలో ఉండి ఎలా పరిష్కరిస్తారో మాజీ మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చేసిన మేలేమిటో, కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయిందో ముందుగా పోరుబాటలో వివరించాలని శ్రీధర్‌బాబు సూచించారు. కార్మికుల సమస్యలపై ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదో ప్రజలకు చెప్పాలని అన్నారు. మారుపేర్ల సమస్యను పదేళ్ల పాలనలో ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు.‎ ఈ సమావేశంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కోరం కనకయ్య, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, మాలోత్ రాందాస్ నాయక్, గండ్ర సత్యనారాయణ రావు, విజయరామారావు, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టర్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

Tags

Related News

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా

Big Stories

Advertisement
×