Drug Trafficking: గ్యాస్ స్టవ్ రిపేరి వచ్చింది. త్వరగా రావాలి అంటూ ఆదేశాలు. చివరికి గ్యాస్ స్టవ్ రిపేరి సామాన్ల ప్యాకెట్ వచ్చింది. కానీ గ్యాస్ స్టవ్ కు సంబంధించిన సామాన్లు మాత్రం అందులో లేవు. ఇటువంటి ఘటనలు హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇంతకు ఆ ప్యాకెట్ లో వచ్చినది ఏమిటంటే డ్రగ్స్.. ఔను మీరు విన్నది నిజమే. డ్రగ్స్ పై పోలీసుల డేగ కన్ను నుండి తప్పించుకొనేందుకు స్మగ్లర్లు ఈ తరహా కోడ్ వాడుతున్నారట. అందుకే పోలీసులు ఆ ప్రయత్నాలను కూడ తిప్పికొట్టారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన విషయాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఇప్పటికే దాడులు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ దాడులతో బెంబేలెత్తిపోతున్న స్మగ్లర్లు మాత్రం కొత్త తరహా ప్లాన్ లను అమలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్యాస్ స్టవ్ విడిభాగాల పేరుతో హెరాయిన్, డ్రగ్స్ సరఫరాను సాగిస్తున్నారట. అది కూడ అందుకు ర్యాపిడో, ఓలా, ఉబేర్ రైడర్లను ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రైడర్లకు అందులో గ్యాస్ స్టవ్ సామాగ్రి అంటూ సమాచారం ఇవ్వడం, ఆ మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలిందని సీపీ సుధీర్ బాబు తెలిపారు.
సీపి తెలిపిన వివరాల మేరకు.. గతేడాది నుండి నేటి వరకు మొత్తం రూ. 88 లక్షల 33 వేల మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 2437 కిలోల గంజాయి, 277 గ్రాములు ఎండీఎంఏ, 523 గ్రాములు హెరాయిన్, 96 కిలోల పాపిస్ట్రా, 27 కిలోల హాషిష్ ఆయిల్, 4 కిలోల ఓపియంలను పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. డ్రగ్ పెడ్లర్ల అరెస్టుతో కన్స్యూమర్ లు ఎవరనేది తెలిసే అవకాశం ఉందని సీపీ హెచ్చరించారు. సైనిక్‌పురిలో గ్యాస్ వ్యాపారం చేస్తున్నారని, గ్యాస్ స్టవ్ విడిభాగాల ముసుగులో హెరాయిన్ డ్రగ్ ను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.
కన్జ్యూమర్లకు ర్యాపిడో, ఓలా, ఉబేర్ ల ద్వారా హెరాయిన్ డ్రగ్ ను సరఫరా చేస్తున్నారని, చాలా కాలంగా వీళ్ళు ఈ డ్రగ్ ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితులను పట్టుకుంటున్నాం కాబట్టే కొత్త కొత్త మార్గాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఓలా, ఉబర్ రైడర్లతో మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు, ఇలాంటివి రైడర్ కు తెలియకుండా అతని ద్వారానే సరఫరా చేయిస్తున్నారన్నారు. బీదర్ వద్ద నిన్నటి కాల్పులు ఘటన పై రాచకొండ టీమ్ లు సైతం నిందితుల కోసం గాలిస్తున్నాయని సీపీ సుధీర్ బాబు అన్నారు.