Assigned Lands: స్వేచ్ఛ బ్యూరో: కబ్జా కు గురైన అసైన్డ్ ల్యాండ్స్, అక్రమంగా కొనుగోలు చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆయా భూములను మళ్లీ నిరుపేద దళితులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ ల్యాండ్స్ వివరాలు, ఆక్రమణలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో రిపోర్టు తయారు చేస్తున్నది. లీడర్ల నుంచి కంపెనీల వరకు వివరాలు తీయాలని సీఎం ఆదేశాలతో.. రెవెన్యూ యంత్రాంగం గ్రౌండ్ లెవల్ వర్క్ ను షురు చేసింది. వాస్తవానికి పేదరికంలో ఉన్న దళితులకు, బలహీన వర్గాలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం గతంలో అసైన్డ్ భూములు కేటాయించింది.
రియల్ ఎస్టేట్ ముఠాల చేతుల్లో బందీ..
కానీ కాలక్రమేణా అవి బడా నేతలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ముఠాల చేతుల్లో బందీ అయ్యాయి. చట్టాలలోని లొసుగులను వాడుకుంటూ, బెదిరింపులతో, నయానో భయాన్నో వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను ఆక్రమించేశారు.ఈ నేపథ్యంలోనే ఆయా అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరు ఏ మేర అసైన్డ్ భూములను ఆక్రమించారో సమగ్ర చిట్టా తీయాలని రెవెన్యూ శాఖను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించింది. ఆక్రమించిన భూములను తిరిగి దళితులకు, పేదలకు అప్పగించడమే లక్ష్యంగా ఈ ఇన్వెస్టిగేషన్ వేగవంతం కావడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఏ మేరకు ఉండొచ్చంటే..?
తెలంగాణలో సుమారు 24 లక్షల నుంచి 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందులో ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2.50 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల పైచిలుకు అసైన్డ్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోనే కోట్లాది రూపాయల విలువైన సుమారు 50 వేల ఎకరాల అసైన్డ్ భూములు లీడర్లు, కంపెనీలు, రియల్టర్ల ఆక్రమణలో ఉన్నాయని రెవెన్యూ శాఖ భావిస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అసైన్డ్ భూములను కబ్జా చేసినట్లు రెవెన్యూ శాఖ ప్రైమరీ రిపోర్టులో గుర్తించారు.
విల్లాల యజమానులకు బిగ్‌షాక్..
కొంత మంది పేదల నుంచి తక్కువ ధరలకు అగ్రిమెంట్లు రాయించుకుని, బినామీల పేర్లతో తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తుంది. మరి కొంత మంది నగరాల శివార్లలో అసైన్డ్ ల్యాండ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధికారులతో చేతులు కలిపి లేఅవుట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించారు. ప్రస్తుతం ఇవి ఫామ్‌హౌస్‌లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా ఇవి రూపాంతరం చెందాయి. ఇక పరిశ్రమల స్థాపన, ఐటీ పార్కులు, రిసార్టులు, సోలార్ పవర్ ప్లాంట్ల పేరుతో పలు కార్పొరేట్ సంస్థలు అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి పొందిన అనుమతుల కంటే అదనంగా చుట్టుపక్కల ఉన్న పేదల భూములను కలుపుకుని కంచెలు వేసినవే అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఆయా భూములన్నింటిపై సర్కార్ ఫోకస్ పెట్టింది.
స్క్రీనింగ్ , డ్రోన్ సర్వేలతో నిర్ధారణ..?
ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయి నుంచి సచివాలయం వరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. అసైన్డ్ భూముల ఒరిజినల్ పట్టాదారులు ఎవరు? ప్రస్తుతం ఆ భూములు ఎవరి వద్ద ఉన్నాయి? పాస్ పుస్తకాలు ఎలా మారాయి? అనే అంశాలపై డిజిటల్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.అంతేగాక ఆక్రమణకు గురైన భూములను పక్కాగా గుర్తించేందుకు శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ సర్వేల ద్వారా సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణాన్ని నిర్ధారించాలని నిర్ణయించారు. అక్రమంగా అసైన్డ్ భూములను కలిగి ఉన్న నాయకులు, కంపెనీలు, వ్యక్తులకు 1977 అసైన్డ్ భూముల నిషేధ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడానికి రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. కోట్ల రూపాయిలు విలువైన భూములు కావడంతో ప్రభుత్వం పకడ్భందీగా నిర్వహించాలని ముందుకు సాగుతుంది.
అసలైన బాధితులకు భరోసా..
అసలు హక్కుదారులైన దళితులు, గిరిజనులు, పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అధికారులు చెప్తున్నారు. అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ఒరిజినల్ అసైనీలకు , వారి వారసులకు అప్పగించే చర్యలు చేపట్టనున్నారు. ఆయా కుటుంబాల ఆర్ధిక పరిస్థితులను అంచనా వేస్తూ అలకేషన్ జరగనున్నది. ఆక్రమణదారుల నుంచి గుంజుకున్న భూమిలో అసలు యజమానులు లేని పక్షంలో, కొత్తగా అర్హులైన దళిత, గిరిజన కుటుంబాలకు కేటాయిస్తారు.మరోవైపు అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులు, కొనుగోలు చేసిన పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. యితే దశాబ్దాలుగా బడా నాయకుల, కార్పొరేట్ సంస్థల చేతుల్లో నలిగిపోతున్న దళితుల హక్కులను పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఈ ‘ఆపరేషన్ అసైన్డ్ రికవరీ’ సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది. భూ రాబందుల గుప్పిటి నుంచి వేల ఎకరాల అసైన్డ్ భూములను విడిపించి దళితుల చేతికి అందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సీనియర్ పొలిటికల్ లీడర్లు చెప్తున్నారు.
Also Read: మలక్‌పేటలో విషాదం.. యువతికి వీడియో కాల్ చేసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య!