Telangana Strike: అబ్బో.. పొద్దున్నే లేచి ఆఫీసుకో, కాలేజీకో వెళ్దామని ఫోన్ తీసి ఆటోనో, క్యాబో బుక్ చేసుకుందామంటే ‘No Drivers Available’ అని చూపిస్తే ఎవరికైనా గుండె గుభేల్ అనాల్సిందే! ‘నాకేం భయం.. బైక్ లేదు, కారు లేదు కానీ జేబులో ఫోన్ ఉంటే చాలు, రాపిడో పిలిచి హాయిగా వెళ్లిపోతా’ అనుకునే మన హైదరాబాద్ జనాల ధీమాకి గట్టి షాకే తగిలింది.
పాపం ఒకవైపు ప్రయాణికులు.. మరోవైపు ‘టిఫిన్ ఆర్డర్ చేస్తే ఐదు నిమిషాల్లో స్విగ్గీ వస్తుంది, కూరగాయలు కావాలంటే బ్లింకిట్, జెప్టో ఉన్నాయి’ అని లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఫుడ్ లవర్స్.. అందరికీ రేపటి నుంచి కాస్త తిప్పలు తప్పేలా లేవు!
ఏమైంది? ఎందుకు ఈ బంద్?
విషయం ఏంటంటే.. జులై 22 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓలా, ఉబెర్, రాపిడో క్యాబ్- బైక్ డ్రైవర్లతో పాటు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో డెలివరీ బాయ్స్ అందరూ సమ్మెకు పిలుపునిచ్చారు. మంగళవారం ముషీరాబాద్‌లోని CITU ఆఫీస్‌లో ‘తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్ల ఫోరం’ పెద్ద ఎత్తున సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో రేపటి నుంచి ఈ సర్వీసులన్నీ నిలిచిపోయే అవకాశం ఉంది.
డ్రైవర్ల బాధలు.. నెత్తిన పెట్రోల్ భారం!
ఈ సమ్మెపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. ‘సడన్‌గా బంద్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలుసు, అందుకు క్షమించండి. కానీ, మా బాధలు వినేవారే కరువయ్యారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, బండి సర్వీసింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్లు.. ఇవన్నీ డ్రైవర్ల నెత్తినే పడుతున్నాయి. కంపెనీలు ఇచ్చే కమీషన్ ఏమో తక్కువ, పడే కష్టం ఏమో ఎక్కువ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.
Also Read: అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!
డిమాండ్లు ఏంటి?
‘రవాణా రంగానికి, రైడింగ్ సర్వీసులకు ప్రభుత్వం వెంటనే ఒక కనీస ప్రాథమిక ఛార్జీని అధికారికంగా ప్రకటించాలి. యాప్ కంపెనీల దోపిడీ నుంచి గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించాలి. గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్లతో ప్రభుత్వాలు మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలి’ అంటూ తమ డిమాండ్లు తెలిపారు.
మనకి ఎందుకు తిప్పలు?
ఈ సమ్మెలో వేలాది మంది క్యాబ్, బైక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు పాల్గొంటున్నారు. కాబట్టి రేపు పొద్దున్నే ఆఫీసులకు వెళ్లేవారు, అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారు ఓలా, ఉబెర్ నమ్ముకుంటే కాస్త కష్టమే! దాంతో పాటు ఆన్‌లైన్ ఫుడ్, గ్రాసరీ ఆర్డర్లు కూడా లేట్ అవ్వడం లేదా అసలు కాకపోవడం జరగొచ్చు. సో, రేపటికి కాస్త అందరూ.. ఆర్టీసీ బస్సులు, మెట్రో లాంటివి చూసుకోవడం బెటర్!
Also Read: రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!