Telangana Consumer : అనుష్క నటించిన జీరో సైజ్ సినిమా చూసే ఉంటారు. కాస్త బొద్దుగా ఉండే అనుష్క.. స్లిమ్ గా మారిపోవాలని ఓ క్లినిక్ లో చేరిపోతుంది. అక్కడ తనలాగే వందల మంది కనిపిస్తారు. క్రమంగా.. రోజులు గడిచే కొద్దీ అసలు విషయం బోధపడుతుంది. అదంతా ఓ వ్యాపారమని.. వారి ఆశలు, మరొకరికి వ్యాపార అవసరాలని గుర్తిస్తుంది. అనైతిక పద్ధతుల్లో, సరైన శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండానే బరువు తగ్గించే టిప్స్ అంటూ.. వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు గుర్తించి.. పోరాడుతుంది. సరిగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
కాస్తా బరువు పెరిగితే చాలా అమ్మాయిలు తెగ బాధపడిపోతుంటారు. అందమంతా కోల్పోయినట్లు దిగాలు చెందుతారు. ఎవరో ఏదో అనుకుంటారనే అనుమానంతో బరువు తగ్గేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్లే టార్గెట్ గా అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసే వాళ్లు ఉంటారు అన్నట్లుగా ఇదో వ్యాపారంగా మారిపోయింది. ఉన్నఫళంగా బరువు తగ్గిపోవాలని కోరుకునే వాళ్ల ఆశలకు అంతు లేనప్పుడు.. వారికి మంచి మాటలతో లక్షలు, కోట్లు పోగుసుకునే వాళ్లూ ఉంటూనే ఉంటారు.
తాజాగా.. ఇలాంటి ఓ సంస్థకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. వైద్యుల సలహా లేకుండా, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఊబకాయం, శరీరంలోని అధిక కొవ్వును తగ్గిస్తామనే క్లినిక్ లపై నివేదిక సమర్పించాలంటూ.. హైదరాబాద్ డీఎం&హెచ్‌వో, వైద్య విధాన పరిషత్ లకు ఆదేశాలు జారీ చేసింది. బరువు తగ్గిస్తామని చెప్పి.. భారీగా డబ్బులు కట్టించుకున్న ఓ సంస్థ నుంచి తిరిగి వడ్డీతో సహా తిరిగి వసూలు చేసింది.
సంగారెడ్డికి చెందిన ఓ యువతి అధిక బరువు తగ్గించుకునేందుకు హైదరాబాద్, హఫీజ్‌పేటలోని కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే క్లీనిక్ ను సంప్రదించింది. 2022లో కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మియాపూర్ బ్రాంచిలో చేరి రూ.1.05 లక్షలు ఫీజుగా చెల్లించారు. కానీ..అక్కడ అనుకున్న మేర ఫలితాలు రాకపోవడం, సరైన వైద్య సహాయం లేకుండానే చికిత్స అందిస్తుండడంతో.. ఆ యువతి తనకు అందిస్తున్న కోర్సు నుంచి బయటకు వచ్చేసింది. తాను చెల్లించిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. సదరు సంస్థ నిరాకరించడంతో.. సంగారెడ్డిలోని జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది ఆ యువతి. బరువు తగ్గిస్తామని చెప్పి తనను మోసం చేశారని, అధికంగా డబ్బులు వసూలు చేసి మోసం చేసారంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్… ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. యువతి చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించాలని సూచించింది. ఈ తీర్పును వ్యతిరేకించిన కలర్స్.. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను సంప్రదించారు.
ఈ కేసు వివరాల్ని పరిశీలించిన రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్‌ఛార్జి అధ్యక్షురాలు మీనా రామనాథన్, సభ్యులు వి.వి.శేషుబాబులతో కూడిన ధర్మాసనం.. క్లినిక్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. నిబంధనలకు విరుద్ధంగా యువతి నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు బరువు తగ్గిస్తామని మోసం చేసినట్లు గుర్తించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద సదరు సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ.. బరువు తగ్గించే అంశం అందులో లేదని గుర్తు చేసింది. కేవలం.. ఫిజియోథెరపీ, చర్మ రక్షణకు సంబంధించిన అనుమతి మాత్రమే ఉందని తెలిపింది. అలాంటప్పుడు.. ప్రభుత్వ అనుమతి లేకుండా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా.. యువత నుంచి డబ్బులు ఎలా స్వీకరించారని, అలాంటి సర్వీసులు ఎందుకు అందిస్తున్నారంటూ మండిపడింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఇలాంటి సంస్థలను నిర్వహించడం సేవా లోపమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : మీకోసం మరిన్ని ఉద్యోగాలు రెడీ.. నిరుద్యోగులకు భట్టి విక్రమార్క బంపరాఫర్..
ఎలాంటి అనుమతులు, సర్టిఫికెట్, లైసెన్స్ లేకుండా బరువు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సంస్థకు జలక్ ఇచ్చింది. యువతికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైనందుకు యువతి చెల్లించిన రూ.1.05 లక్షలకు 9% వడ్డీని జత చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు యువతి మానసిక వేదనకు కారణమయ్యారంటూ ఆరోపిస్తూ యువతికి పరిహారం కింద రూ.50 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. దాంతో పాటే.. రాష్ట్రంలోని ఇలాంటి ఇతర సంస్థలపై చర్యలకు సిద్ధమైన రాష్ట్ర వినియోగదారుల కమిషన్.. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్నక్లినిక్‌ల పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని హైదరాబాద్ డీఎం&హెచ్‌వో, వైద్య విధాన పరిషత్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సంస్థల కార్యకలాపాలపై మార్చి 17లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది.